సినిమాల్లోనే హీరో కాదు.. బయట కూడా హీరోనే. సినిమాల్లోనే కెప్టెన్ కాదు.. బయట కూడా కెప్టెనే. లారెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటలు కచ్చితంగా వినిపిస్తాయి. దానికి కారణం సినిమాలకు బయట ఆయన చేసే పనులు. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. దివ్యాంగులైనా డ్యాన్స్‌లో రాణిస్తున్న కొందరు యువకులను పిలిచి గౌరవించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు.
తాను డ్యాన్సర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రేక్షకులు తన దగ్గరి వచ్చి రూపాయి కాగితాలను చొక్కాకు గుచ్చేవారు. పూల దండలు వేసేవారు. ఆ ప్రోత్సాహం నాకెంతో సంతోషంగా ఉండేది. అలాంటి ఆనందాన్నే నా బాయ్స్‌కు కూడా ఇవ్వాలని అనుకున్నాను. వాళ్లను ఆశ్చర్య పరచాలనుకున్నాను. అందుకే వాళ్లపై నోట్ల జల్లు కురిపించాను. ఇది వారిని ప్రశంసించడమే కాదు, వారి ప్రతిభకు ప్రోత్సాహం కూడా. మీ వేడుకల్లోనూ వారు ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించండి. వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంతో పాటు, సంతోషాన్నీ కలిగిస్తుంది అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు లారెన్స్.
ఇటీవల లారెన్స్ తన సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్టు తెలిపారు. అందులో విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని తెలిపారు. ‘కాంచన 4’ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌తో ఈ సేవా కార్యక్రమం షురూ చేశానని తెలిపిన లారెన్స్.. ఆ ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థే త్వరలో ప్రారంభం కానున్న పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తారని కూడా తెలిపారు. నేను కట్టుకున్న తొలి ఇంటిని విద్యార్థుల కోసం పాఠశాలగా మారుస్తుండటం ఆనందంగా ఉంది. ఈ ఇల్లు నాకెంతో ప్రత్యేకం. డ్యాన్స్ మాస్టర్‌గా నేను సంపాదించిన డబ్బుతో కట్టించిన ఇల్లు ఇది. దాన్ని ఇంతకు ముందు అనాథాశ్రమంగా మార్చాం. అప్పుడు కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో ఉండేవాడిని అని గుర్తు చేసుకున్నారు. ఆ ఇంట్లో (అనాథాశ్రమంలో) ఆశ్రయం పొందిన వారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అని లారెన్స్ చెప్పారు.