‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వేణు ఊడుగుల.. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. అంటే మల్టీస్టారర్ అన్నమాట. ఇదివరకు సితార ఎంటర్టైన్మెంట్స్ లో ‘భీమ్లానాయక్’ అనే మల్టీస్టారర్ తెరకెక్కింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానాలు నటించారు. ఇప్పుడు సితార సంస్థ మరో భారీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది.
వేణు ఊడుగుల రాసుకున్న కథ ప్రకారం.. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి, పాతికేళ్ల కుర్రాడికి మధ్య నడిచే డ్రామానే ఈ సినిమా. ఈ రెండు పాత్రలు కోసం సితార సంస్థ పెద్ద హీరోల కోసమే ప్రయత్నిస్తోంది. తెలుగులో ఇద్దరు హీరోలు సెట్ కాకపోతే.. తమిళం నుంచి ఓ స్టార్ ని, తెలుగు నుంచి మరో స్టార్ ని కలిపి సినిమా చేయాలనుకుంటున్నారు. అది కూడా కుదరకపోతే ఇద్దరు హీరోలకు తమిళ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు. ఈ కథ పెద్ద హీరోలను డిమాండ్ చేస్తోంది. వాళ్ల కాల్షీట్స్ దొరకడమే కష్టంగా మారుతోంది. లేదంటే ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయేది. ఇందులో నటించే హీరోలెవరు ఫిబ్రవరి నెలాఖరులోపు తెలిసిపోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. హీరోలు కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేస్తారు. మరోపక్క దర్శకుడు వేణు ఊడుగుల..
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నారు. వారి బ్యానర్ లో కూడా త్వరలోనే సినిమా చేయనున్నారు. వేణు ఊడుగుల చివరి సినిమా ‘విరాటపర్వం’ కమర్షియల్ గా వర్కవుట్ కానప్పటికీ.. దర్శకుడిగా అతడికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అది కూడా పెద్ద బ్యానర్స్ నుంచి రావడం విశేషం. ఈ సినిమాలతో వేణు ఊడుగుల సత్తా చాటితే అతడి కెరీర్ కి ఢోకా ఉండదు. మరేం జరుగుతుందో చూడాలి.