పందెం కోడి2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ పై విశాల్ కామెంట్స్

  • October 15, 2018 / 12:11 PM IST

“మహానటి” సినిమా చూసిన తర్వాత ప్రతి తెలుగు-తమిళ ప్రేక్షకుడు మనస్ఫూర్తిగా కోరుకున్న ఏకైక కోరిక సావిత్రిలా అచ్చుగుద్దినట్లు నటించి-జీవించిన కీర్తి సురేష్ కు అన్నీ అవార్డులు రావాలని. ఆ కోరిక ఎలాగో నెరవేరుతుందనుకోండి. అయితే.. కీర్తి సురేష్ తో ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న విశాల్ మాత్రం ఒకడుగు ముందుకేసి ఏకంగా ఆమెకు నేషనల్ అవార్డ్ రావాలని స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేశాడు. నిన్న జరిగిన పందెంకోడి 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ.. “పందెంకోడి నా రెండో సినిమా. మామూలు హీరోని యాక్షన్‌ హీరోగా నిలబెట్టిన సినిమా. పందెంకోడి ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. మళ్లీ నేను, లింగుస్వామి కలిసి 13 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా పందెంకోడి 2 చేయడం నిజంగా దేవుడి ఆశీర్వాదమే. ఈ సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో.. కీర్తిసురేశ్‌, వరలక్ష్మిలకు అంతే ప్రాముఖ్యత ఉంది. సినిమా చూశాను. వరలక్ష్మి ఎక్స్‌ట్రార్డినరీగా చేసిందని, తర్వాత కీర్తి సురేశ్‌ అద్భుతంగా చేసిందని.. తర్వాత లింగుస్వామి సినిమాను అద్భుతంగా మలిచారని.. సినిమా చూసిన ప్రేక్షకులు అంటారు. వీరందరి తర్వాతే నన్ను గుర్తుకు తెచ్చుకుంటారు. యువన్‌ నా స్వంత సోదరుడిలాంటోడు.

తను ప్రతిసారి మంచి సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాలో పాటలతో పాటు.. అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. పూజ రూమ్‌లోని సామి కంటే నేను లింగుస్వామినే ఎక్కువగా నమ్మాను. ఆయనకు నా ధన్యవాదాలు. నేను మరో 25 సినిమాలు చేసేలా ఈ 25వ సినిమా పందెంకోడి 2 ఉంటుంది. పందెంకోడి 3 చేయడానికి మళ్లీ 13 ఏళ్లు సమయంలో కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. వరలక్ష్మికి ఇప్పుడు సమయం వచ్చింది. తను అద్బుతంగా పెర్‌ఫార్మ్‌ చేసింది. అలాగే కీర్తి రూపంలో నాకొక మంచి ఫ్రెండ్‌ దొరికారు. మా జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. ఆయన నా నెక్స్‌ట్‌ సినిమా నిర్మాత. ఈ సినిమా సమర్పకుడు. అక్టోబర్‌ 18న తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్‌ శక్తి ఫెంటాస్టిక్‌ విజువల్స్‌ అందించారు. అభిమన్యుడు సమయంలో ఓ విషయం చెప్పాను. అదేంటంటే.. మనం మరచిపోయిన వ్యక్తులు అయిన రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేస్తానని అన్నాను. ఆ మాటను ఈరోజు నేరవేర్చుకుంటున్నాను. మనదేశంలోనే రైతులు ఎంతో కష్టపడుతున్నారు. గవర్నమెంట్‌ అనుకుంటే వాళ్ల అప్పులు తీర్చేయవచ్చు. కానీ.. తీర్చరు. గవర్న్‌మెంట్‌ తలుచుకుంటే రైతుల బ్రతుకులు చిటెకెలో మార్చేయొచ్చు. కానీ చేయరు. గవర్నమెంట్‌ తలుచుకుంటే రైతుల పిల్లలు, మంచి చదువులు చదువుకోవచ్చు. కానీ చేయరు. గవర్నమెంట్‌ ఏర్పరిచింది మనమే కదా!.. మనం ప్రయత్నం చేస్తామని నేను భావించి ప్రేక్షకులు కొనే టికెట్‌ డబ్బులు నుండి రూపాయి అడిగాను. రైతులు పొలాల్లో కాళ్లు పెడితేనే మనం అన్నంలో చేయిపెట్టగలుగుతాం. ఈ రైతులకు నేను చచ్చే వరకు ఏదో ఒక విధంగా మంచి చేయడానికి ముందుంటాను. వాళ్ల కోసమైనా నేను ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ప్రభుత్వాన్ని నేను కోరేదొకటే.. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్‌లో ప్రతి రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. తప్పకుండా సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నాకు థియేటర్‌ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు” అని ముగించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus