తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే అతి పెద్ద పార్టీగా నిలవడం, ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, ఇప్పుడు సీఎంగా అదరగొడుతుండటం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కువ విమర్శలు ఎదుర్కున్న కోలీవుడ్ హీరో ఎవరు అంటే తలైవా రజనీకాంత్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ – తమిళ రాజకీయాలను ఫాలో అయ్యేవారికి ఏమైంది అనేది తెలిసే ఉంటుంది. దీని గురించి విష్ణు విశాల్ తాజాగా కొన్ని కామెంట్లు చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.
తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌పై, ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ అసూయపడుతున్నారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు కూడా. ఈ వార్తలపై నటుడు విష్ణు విశాల్ స్పందించారు. ఈ వివాదంపై రజనీకాంత్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. తన కొత్త సినిమా ‘గట్టి కుస్తీ 2’ / ‘మట్టి కుస్తీ2’ ప్రచారంలో భాగంగా విష్ణు విశాల్ మాట్లాడారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మండిపడ్డాడు. అంతేకాదు సీఎంకి విజయ్ అంటే ఎలాంటి అసూయ లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు బాధగా ఉందన్నారు. నాలుగు రోజులు మౌనంగా ఉంటే ఊహాగానాలు రాసేస్తున్నారు. రజనీకాంత్ కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నందుకు నిందించారు. ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన కెరీర్‌లో సాధించిన విజయాల తర్వాత.. ఆయనకు అసూయ ఉందని ఎలా అనగలరు. ఇది చాలా బాధాకరం అని అన్నారు.
సినిమా రంగంలో ఉండే వృత్తిపరమైన గౌరవాన్ని, వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడొద్దని విష్ణు విశాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విజయ్ సీఎం అయ్యాక రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పకపోవడంపై చర్చ జరగ్గా రజనీ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ’ అని ఎదురు ప్రశ్నించిన విషయం తెలిసిందే.