వివాహ భోజనంబు సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 27, 2021 / 06:31 PM IST

కమెడియన్ సత్య కథానాయకుడిగా మారుతూ నటించిన చిత్రం “వివాహ భోజనంబు”. కథానాయకుడు సందీప్ కిషన్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 27) సోనీ లైవ్ యాప్ లో విడుదలైంది. లాక్ డౌన్ టైంలో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉండి పడిన ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: మహేష్ (సత్య) ఓ సాధారణ ఎల్.ఐ.సి ఏజెంట్. ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాడు. గొప్పింటి అమ్మాయి అనిత (ఆర్జవీ)ని ప్రేమిస్తాడు. మహేష్ & ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా తమ స్టేటస్ కు సరితూగనప్పటికీ.. అదృష్టం సహకరించడంతో మహేష్-అనితల పెళ్లి కరోనా కారణంగా కేవలం 30 మంది బంధువుల మధ్య చక్కగా జరిగిపోతుంది. పెళ్ళై.. బంధువులందరూ ఇంటికి తిరుగు ప్రయాణమవుతుండగా.. మోడీ లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్యామిలీ మొత్తం మహేష్ ఇంట్లోనే సెటిల్ అయిపోతారు. పెళ్లి కూతురు కుటుంబాన్ని పోషించలేక మహేష్ పడ్డ ఇబ్బందుల సమాహారమే ఈ చిత్రం.

నటీనటుల పనితీరు: సత్య కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. తన పాత్రకు 100% న్యాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు సత్య. ఈ సినిమాలోనూ మహేష్ పాత్రలో అదరగొట్టాడు. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ అర్జవీ హావభావాల విషయంలో చాలా పరిణితి చెందాల్సి ఉంది. చాలా సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టేసింది కానీ సన్నివేశానికి తగ్గ ఎక్స్ ప్రెషన్ మాత్రం ఇవ్వలేదు.

శ్రీకాంత్ అయ్యంగార్ కి మరో మంచి పాత్ర దొరికింది. ఫ్రస్ట్రేటడ్ ఫాదర్ క్యారెక్టర్ లో హాస్యాన్ని పంచాడు. దివంగత టి.ఎన్.ఆర్ ఈ చిత్రంలో నవ్వించి అలరించాడు. సుదర్శన్ కూడా పర్వాలేదనిపించుకున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ పాత్రలో సందీప్ కిషన్ మెరిశాడు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రామ్ అబ్బరాజు జంధ్యాల-ఈవీవీల తరహాలో చిన్న కథకు, బోలెడన్ని పాత్రలు జోడించి సినిమాను స్క్రీన్ ప్లేతో అలరిద్దామని ప్రయత్నించాడు కానీ.. పెద్దగా ఫలించలేదు. ప్రతి పాత్రతో కామెడీ ట్రై చేసాడు, బట్ సత్ఫలితం రాలేదనే చెప్పాలి. పైగా ఎమోషన్స్ ఏవీ కూడా సహజంగా లేవు. ఆ కారణంగా సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే. క్యారెక్టరైజేషన్స్ గట్రా అన్నీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం సినిమాకి ఇంకో మైనస్. ఆల్రెడీ లెక్కకుమిక్కిలి కామెడీ స్కిట్స్ & వెబ్ సిరీసుల్లో నలిగిపోయిన కాన్సెప్ట్ ఇది.

అందువల్ల కొత్తదనం కొరవడింది. అలాగే.. కామెడీ సీన్స్ & ఎమోషన్స్ అన్నీ పాతవే కావడంతో పెద్ద ఆసక్తికరంగా సాగలేదీ చిత్రం. ఈ రెండు కారణాల వల్ల “వివాహ భోజనంబు” ఓ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. అనివీ అందించిన పాటలు బాగున్నప్పటికీ.. నేపధ్య సంగీతం & సౌండ్ మిక్సింగ్ మాత్రం బాగోలేవు. ముఖ్యంగా నేపధ్య సంగీతం మెయిన్ మైనస్ గా మారింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి.

విశ్లేషణ: లాక్ డౌన్ లో కుటుంబం ఇంట్లో ఉండడం, కరోనా కారణంగా భయపడడం లాంటివి జనాలకు బోర్ కొట్టేసిన అంశాలు. నిజానికి ఈ చిత్రం థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా గత ఏడాది విడుదలై ఉంటే జనాలు కాస్తైనా ఎంజాయ్ చేసేవారు. కానీ.. లాక్ డౌన్ అంటేనే జనాలు బోర్ గా ఫీల్ అవుతున్న టైంలో విడుదలవ్వడం, అది కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో. అందువల్ల సినిమా మీద జనాలకి పెద్దగా ఆసక్తి లేకుండాపోయింది. సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో “వివాహ భోజనంబు” ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. సత్య కామెడీ టైమింగ్ & ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ కోసం మాత్రం సినిమాని ఒక్కసారి ఓపిగ్గా చూడొచ్చు.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus