వివేకం

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం “వివేగం”. “వీరం, వేదాలమ్” తర్వాత అజిత్-శివల కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & సాంగ్స్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ క్రేజ్ తోపాటు విపరీతమైన హైప్ మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : అజయ్ కుమార్ (అజిత్) ఇండియన్ ఇంటిలిజెంట్ ఏజెంట్. ప్రపంచంలో భూకంపాల ద్వారా సంక్షోభాన్ని సృష్టించాలనుకొన్న కొందర్ని పట్టుకొని వారు చేయాలనుకొన్న దుశ్చర్యను ప్రతిఘటించాలనుకొంటాడు. అయితే.. అజయ్ ఊహించని విధంగా తన స్నేహితుడైన ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్) అండ్ ఫ్రెండ్స్ తనని మోసం చేయడమే కాక తన ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ దొంగ దెబ్బ నుంచి దారుణమైన గాయాలతో బయటపడిన అజయ్ ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా చిత్రీకరిస్తాడు ఆర్యన్. ఆర్యన్ చేసిన మోసాన్ని గ్రహించిన అజయ్ కౌటర్ ఎటాక్ స్టార్ట్ చేస్తాడు. అజయ్-ఆర్యన్ ల ఎటాక్ అండ్ కౌంటర్ ఎటాక్స్ లో చివరికి ఎవరు నెగ్గారు? షాడో గ్యాంగ్స్ చేయాలనుకొన్న భారీ విస్పోటనాన్ని అజయ్ అడ్డుకోగలిగాడా? అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.

నటీనటుల పనితీరు : నటుడిగా అజిత్ పెర్ఫార్మెన్స్ విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేదు. మిలటరీ పర్సన్ గా పర్సనాలిటీ అండ్ లుక్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. హాలీవుడ్ హీరోలా కనిపించాడు కొన్ని ఫ్రేమ్స్ లో. అజిత్ అభిమానులకు ప్రతి స్లోమోషన్ షాట్ ఒక పండగే. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీ (పూర్తి స్థాయిలో ఫామ్ అవ్వలేదు) ట్రాన్స్ ఫార్మేషన్ ను మెచ్చుకొని తీరాలి. ఈ వయసులోనూ డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లు-బైక్ స్టంట్స్ చేయడం ప్రశంసనీయం. కాజల్ అగర్వాల్ గృహిణిగా కాస్త బరువైన పాత్ర పోషించింది. అనునిత్యం భర్తను ప్రోత్సహించే బాధ్యతగల భార్యగా చక్కని నటనతో ఆకట్టుకొంది. కాకపోతే.. క్లైమాక్స్ లో పాటపాడుతూ సీరియస్ లుక్స్ లో కనిపించడానికి విశ్వప్రయత్నం చేసిన కాజల్ ను జనాలు ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి. వివేక్ ఒబెరాయ్ విలనిజాన్ని చాలా స్టైలిష్ గా ప్రెజంట్ చేశాడు. అజిత్ తో తలపడేది కేవలం ఒక్క సన్నివేశంలోనే అయినా.. ఇద్దరి మధ్య నడిచే మైండ్ గేమ్ ఆద్యంతం ఆకట్టుకోవడంలో వివేక్ ఒబెరాయ్ స్క్రీన్ ప్రెజన్స్ చాలా హెల్ప్ అయ్యింది. కనిపించింది కాసేపే అయినా.. హ్యాకర్ పాత్రలో అక్షర హాసన్ పర్వాలేదనిపించుకొంది.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాకి అజిత్ తర్వాత బిగ్గెస్ట్ ఎస్సెట్ అనిరుధ్ మ్యూజిక్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అనిరుధ్ సమకూర్చిన నేపధ్య సంగీతం, యాక్షన్ సీక్వెన్స్ లోని ఇంటెన్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ అనిరుధ్ వాడిన ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుంది. రెగ్యులర్ థియేటర్స్ లో చూస్తే గోల గోలగా వినిపించొచ్చేమో కానీ.. డాల్బీ ఎట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో చూస్తే మాత్రం మూవీ లవర్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటివరకు శివ దర్శకత్వం వహించిన అన్నీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన వెట్రి సినిమా స్టాండర్డ్స్ ను తన కెమెరా పనితనంతో ఎలివేట్ చేయలేకపోయాడు. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ.. బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయ్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ మరియు 200 పైగా ఫారినర్స్ తో షూట్ చేసిన మాఫియా గ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం స్టైలిష్ గా కాక పూర్ కెమెరా వర్క్ వల్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ అదిరిపోయాయ్. చాలా ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల సినిమా మొత్తం హాలీవుడ్ స్థాయి ఫీల్ ను ఇస్తుంటుంది. ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి అద్భుతమైన క్వాలిటీ ఫిలిమ్ ను నిర్మించినందుకు నిర్మాతలను మెచ్చుకోవాల్సిందే.

ఇక దర్శకుడు శివ పనితనం గురించి చెప్పాలంటే..
కథ ను “జీఐజో రీటాలియేషన్” (GI Jeo Retaliation) నుండి ఇన్స్పైర్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ హైవే ఫైట్ సీక్వెన్స్ ను “సికారియో” (Sicario), హీరో కమ్ బ్యాక్ సీన్ ను ” ది బౌర్న్ లీగసీ” (The Bourne Legacy).. ఇలా చాలా హాలీవుడ్ సినిమాల నుండి ఇన్స్పైర్ అయ్యి.. ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాడు. అయితే.. క్లైమాక్స్ కి తమిళ తెలివితేటలు వాడి హీరోయిన్ పాట పాడుతుంటే హీరో-విలన్ ఒకర్నొకరు తన్నుకొని చావడం అనేది మాత్రం అజిత్ ఫ్యాన్స్ కు కూడా పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇక స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకుండా ఒక ఫైట్-ఒక చేజ్ అన్నట్లుగా సినిమా మొత్తాన్ని పరిగెట్టించిన విధానం మాస్ ఆడియన్స్ వరకూ పర్లేదు కానీ.. రెగ్యులర్ మూవీ గోయర్స్ ను మాత్రం ఆకట్టుకోలేదు. అన్నిటికీ మించి 600 మీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తికి “మోర్స్ కోడ్” వినిపించదు అనే కనీస స్థాయి లాజిక్ ను ఎలా మిస్ అయ్యాడో శివకే తెలియాలి. మొత్తానికి.. అజిత్ తో తన మూడో చిత్రాన్ని చెప్పినట్లుగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించాడు శివ. అయితే.. కథలో సెన్స్ అండ్ లాజిక్ మిస్ అవ్వడంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం. మాస్ ఆడియన్స్ మరియు అజిత్ ఫ్యాన్స్ కు మాత్రం “వివేకం” ఒక విందు భోజనం.

విశ్లేషణ : ప్రేక్షకుల అభిరుచుని కాక కథానాయకుడి ఇమేజ్ మరియు అతడి అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన చిత్రం “వివేకం”. సో, లాజిక్ తో పనిలేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ లను, హాలీవుడ్ స్థాయి టేకింగ్ ను, అనిరుధ్ అదరగొట్టే బ్యాగ్రౌండ్ స్కోర్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు “వివేకం” సినిమాని హ్యాపీగా థియేటర్లలో చూడవచ్చు.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus