బాలనటిగా సినిమాల్లోకి వచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి హిందీ, పంజాబీ, తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది వామికా గబ్బి. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చే పనిలో ఉంది. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హిట్ హారర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన మడాక్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి వచ్చింది. మడాక్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగమైనట్లు ఇటీవల ఓ ఫొటోతో చెప్పింవది వామికా.
వామికా గబ్బి అంటే మనకు తెలిసిన అమ్మాయే. పదేళ్ల క్రితం అంటే 2015లో ‘భలే మంచి రోజు’ అంటూ సుధీర్‌బాబుతో వచ్చి పలకించింది. ఆ సినిమాకు మంచి టాకే వచ్చినా.. ఆమెకు ఆ తర్వాత తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు. అయతే అనూహ్యంగా రెండేళ్ల క్రితం వామికా హవా పెరిగింది. వరుస సినిమాల్లో కాస్త ఎక్కువ గ్లామర్ టచ్, బోల్డ్ లుక్‌లో కనిపించి ‘మత్తు కళ్ల సుందరి’ అనే పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు.
ఈ లిస్ట్‌లోకి మడాక్ యూనివర్స్ సినిమా కూడా వచ్చింది. త్వరలో ఈ సిరీస్ నుండి రష్మిక మందన ‘థామా’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘మడాక్ ఫిల్మ్స్‌లో కొత్త ప్రారంభం’ అనే కామెంట్‌తో వామికా ఓ ఫొటో షేర్ చేసింది. మరి వామిక ఎలాంటి సినిమాతో రాబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే మడాక్ యూనివర్స్‌లో హీరోయిన్లు భయపడతారు, అలాగే భయపెడతారు కూడా. మరి వామికా ఏం చేస్తుందో చూడాలి.
పైన చెప్పినట్లు ఆమె లైనప్ సంగతి చూస్తే.. అడివి శేష్ ‘జీ 2’, ‘కిక్లీ’, ‘ఇరవాకాలమ్’, ‘జీనీ’, ‘దిల్ కా ధర్వాజా ఖోల్ నా డార్లింగ్’, ‘టికీ టకా’, ‘భూత్ బంగ్లా’, ‘పతి పత్నీ ఔర్‌వో 2’ సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉన్న హీరోయిన్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఇంకెవరూ లేరేమో.