మహేష్ బాబు 25 వ చిత్రంగా వస్తున్న ‘మహర్షి’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను మే 1న (నిన్న) హైదరాబాద్, నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఘనంగా నిర్వహించారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు ముఖ్య అతిథిలుగా హాజరుకావడంతో ఈ వేడుకకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇక మాహేష్ బాబు మాట్లాడుతూ.. తన 25 సినిమాల దర్శకులందరికీ మహేష్ స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, గుణశేఖర్ వంటి దర్శకుల పేర్లు చెప్పాడు. కొరటాల శివని ప్రత్యేకంగా పొగిడేసాడు. వంశీ పైడిపల్లిని కూడా స్పెషల్ గా ట్రీట్ చేశాడు.
అయితే పూరి జగన్నాథ్ పేరు మాత్రం చెప్పలేదు. మహేష్ కి సరైన మార్కెట్ కూడా లేని రోజుల్లో ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు పూరి. ఇదేదో లాటరీలో హిట్టు కొట్టేసాడు అని చాలా మంది కామెంట్స్ చేసినా… అది కరెక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే అలా లాటరీలో హిట్టయిన సినిమా అయితే రీమేక్ చేసిన హిందీ,తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ గా ఎందుకు నిలుస్తుంది. మహేష్ ను స్టార్ హీరోను చేసింది పూరీనే. ఈరోజు ఇంత ‘స్టార్ డం’ ను అనుభవిస్తున్నాడు అన్నా.. ఇన్ని రికార్డు ఓపెనింగ్స్ వస్తున్నాయన్నా అది పూరి మహిమే అని చెప్పాలి. అలాంటి ‘పోకిరి’.. చిత్రాన్ని తెరకెక్కించిన పూరీని ఎలా మర్చిపోతాడు. అందులోనూ ‘బిజినెస్ మేన్’ అనే చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చాడు. ‘అన్నా సినిమా.. ప్లాప్ అయినా పర్వాలేదు.. పూరి జగన్ తో ఓ సినిమా చెయ్యి.. నీ యాటిట్యూడ్ ను పూరి గారు చూపించినట్టు మరే డైరెక్టర్ చూపించలేడు’… ఇలా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికీ కామెంట్లు పెడుతూనే ఉన్నారు.
అలాంటి పూరి జగన్నాథ్ పేరు స్టేజ్ మీద చెప్పడం మహేష్ మర్చిపోవడం ఆశ్చర్యమే…! అయితే అది అనుకోకుండా జరిగిందని మహేష్ ట్వీట్ ద్వారా తెలిపాడు. తన స్పీచ్ లో ముఖ్యమైన వ్యక్తిని ప్రస్తావించడం మర్చిపోయానని, పోకిరి సినిమా ఎప్పటికీ మర్చిపోలేనని రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్లో నిజంలేదని… పూరికి, మహేష్ కి కొన్ని మనస్పర్థలు వచ్చాయన్నది కూడా ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ తో పనిచేసిన అందరి డైరెక్టర్లు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్న వీడియో ఒకటి వేశారు. ఈ వీడియోలో వై.వి.ఎస్ చౌదరి, బి.గోపాల్ వంటి ఫేడవుట్ అయిపోయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే పూరి జగన్నాథ్ విషెస్ చెప్పిన వీడియో లేదు. మహేష్ ఎంత కవర్ చేసినా… ఈ వీడియో విషయంలో దొరికిపోయాడు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.