వార్ సినిమా రివ్యూ & రేటింగ్!

బాలీవుడ్ హాటెస్ట్ హీరోస్ అయిన హృతిక్ రోషన్ & టైగర్ ష్రాఫ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ధమాకా ఫిలిమ్ “వార్”. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: ఇండియన్ ఇంటిలిజెన్స్ టీం లో బెస్ట్ మెంబర్ అయిన కబీర్ (హృతిక్) తన టీం కి ద్రోహం చేసి.. దేశద్రోహిగా మారతాడు. అతడ్ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం అతడి బెస్ట్ స్టూడెంట్ అయిన ఖళీద్ (టైగర్ ష్రాఫ్)ను నియమిస్తుంది. ఈ గురుశిష్యుల యుద్ధంలో ఎవరు గెలిచారు? అసలు బెస్ట్ సోల్జర్ అయిన కబీర్ ఉన్నట్లుండి ద్రోహిగా ఎందుకు మారాడు? అనేది తెలియాలంటే “వార్” సినిమా చూడాలన్నమాట.

నటీనటుల పనితీరు: “సూపర్ 30″లో బిహారీ టీచర్ గా డీగ్లామరస్ రోల్ ప్లే చేసిన హృతిక్ ఈ చిత్రంలో అల్ట్రా స్టైలిష్ గా తన అభిమానులు ఇష్టపడే కండలు తిరిగిన దేహంతో అలరించాడు. ఇక టైగర్ బాబు కుదిరినప్పుడల్లా షర్ట్ విప్పేసో లేక చింపేసో తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో నటుడిగానూ మంచి మార్కులు సంపాదించుకొన్నాడు టైగర్. హృతిక్ తో పోటీపడి చేసిన డ్యాన్సులు, యాక్షన్ సీన్స్ బాగున్నాయి.

వాణీకపూర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఉన్నంతలో గ్లామర్ తో ఆకట్టుకొంది. అశుతోష్ రాణా, అనుప్రియ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా ద్వయం సమకూర్చిన నేపధ్య సంగీతం మాత్రం ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. సౌండ్ డిజైనింగ్ కూడా కొత్తగా ఉంది. ముఖ్యంగా ప్రధాన పాత్రల ఫైట్ సీక్వెన్స్ లలో సౌండ్ ఎఫెక్ట్స్ ను బాగా ప్లాన్ చేశారు.

బెంజమిన్ సినిమాటోగ్రఫీ, విశాల్-శేఖర్ పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎక్కడా రాజీపడలేదు. వి.ఎఫ్.ఎక్స్ & డి.టి.ఎస్ మిక్సింగ్ వర్క్ వేరే లెవల్లో ఉన్నాయి.

టెక్నికల్ అంశాలు ఇంత బాగున్నప్పటికీ.. సినిమాకి చాలా ముఖ్యమైన అంశం అయిన కథ మిస్ అవ్వడంతో.. బాగా బోర్ కొడుతుంది. ప్రీక్లైమాక్స్ వచ్చే మెయిన్ ట్విస్ట్ మినహా ఆకట్టుకొనే అంశం కథ-కథనాల్లో ఎక్కడా కనిపించదు. దాంతో ప్రేక్షకుడు యాక్షన్ సీన్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటాడు. ఉన్న ఆ ఒక్క ట్విస్ట్ కూడా మరీ ఇల్లాజికల్ గా ఉండడంతో నిరాశపడతాడు ప్రేక్షకుడు. లాజిక్కులు పక్కన పెట్టినా.. కథనంలో ఎక్కడా ఆసక్తికరం అనేది లేదు. దాంతో.. సినిమా బోర్ కొట్టడం మాత్రమే కాదు.. సెకండాఫ్ లో సాగతీతకు నీరసపడతారు కూడా. సో, ఇద్దరు హాటెస్ట్ & మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోలను ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేయడంలో దర్శకుడు చూపిన ఆసక్తి.. సినిమాను నడిపించడంలో చూపలేదు.

విశ్లేషణ: కథ-కథనం-లాజిక్స్ అనేవి పక్కన పడేసి.. కాసేపు బోర్ కొట్టినా పర్లేదు.. హృతిక్-టైగర్ ల యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునేవారు మాత్రమే కాస్త ఓపికతో చూడదగ్గ చిత్రం “వార్”. ట్రైలర్ చూసి ఏదో ఉంటుంది అని ఊహించి థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందడం ఖాయం.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus