ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 11.00 గంటల సమయంలో గుండెపోటు కారణంగా చనిపోయిన అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచం మొత్తం కన్నీటి వీడ్కోలు పలికింది. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఆమె మరణానికి ఒకరోజు మొత్తం మౌనం పాటించినంత పనిచేసింది. నటిగా 300లకి పైగా చిత్రాల్లో నటించడమే కాక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర కథానాయికా స్థానం సంపాదించుకొన్న మహోన్నతమైన నటి కోసం ఆమాత్రం చేయడంలో తప్పులేదనుకోండి.
అయితే.. అందరూ అనుకొంటున్నట్లుగా శ్రీదేవి గుండెపోటుతో సహజ మరణం చెందలేదని. దాని వెనుక వేరే కారణాలున్నాయని బాలీవుడ్ మీడియాతోపాటు సోషల్ మీడియా కూడా కాస్త గట్టిగానే వాదిస్తుంది. 50 ఏళ్ల వయసులోనూ నాజూగ్గా ఉండడం కోసం ఆమె చేయించుకొన్న ట్రీట్ మెంట్స్ వికటించాయని కొందరు అభిప్రాయపడుతుండగా.. శ్రీదేవి కుటుంబానికి దగ్గరైన వారు మాత్రం శ్రీదేవికి గతంలోనే డాక్టర్లు మందు తాగవద్దని వారించారు. అయితే.. 24వ తారీఖు రాత్రి శ్రీదేవి హాజరైన తన బంధువుల పెళ్ళిలో లిమిట్ కి మించి తాగేసిందని, అందువల్లే హోటల్ కి తిరిగిరాగానే స్పృహ కోల్పోయి పడిపోయిందని, లివర్ ఎఫెక్ట్ అవ్వడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ముందే మరణించిందని కూడా కొందరు పేర్కొంటున్నారు.
ఈ వాదనలు పక్కనేడితే.. దుబాయ్ గవర్నమెంట్ శ్రీదేవి పార్ధివదేహాన్ని ఇండియా పంపించడానికి నిరాకరించి, అక్కడే పోస్ట్ మార్టం చేయడం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి పేషీ నుంచి ఫోన్లు వెళ్ళినా, అంబానీ ప్రయివేట్ జెట్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా కూడా దుబాయి అధికారులు ఒప్పుకోకపోవడం గమనార్హం. ఎలాగూ దుబాయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకి తెలిసే అవకాశాలు ఎలాగూ తక్కువే కాబట్టి.. ప్రస్తుతానికి ఆమె అంత్యక్రియలు ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొందాం.