కొన్ని రోజుల క్రితం వరకు కళ్యాణమండపాలు పెళ్లిళ్లతో కళకళలాడాయి. ఇప్పుడు థియేటర్లు వివాహాలతో కళకళలాడుతున్నాయి. థియేటర్లో పెళ్లిళ్లు ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ.. పెళ్లి సందడి ని నింపుకున్న సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. రెండు రోజుల ముందుగానే ఆ హడావుడి మొదలయిపోయింది. శనివారం రిలీజ్ అయిన “హ్యాపీ వెడ్డింగ్” సినిమాలో పెళ్లికూతురిగా మెగా డాటర్ నిహారిక నటించింది. నిర్చితార్ధం నుంచి పెళ్లి వరకూ జరిగే కథ ఇది. అమ్మా నాన్నలని వదిలి, ఓ కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు వాళ్లకి ఎన్ని రకాల భయాలు వుంటాయో అక్షర పాత్ర ద్వారా చూపించారు.
సినిమా మొత్తం పెళ్లి వేడుకను కళ్లకు కట్టింది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడుగా మారి చేసిన సినిమా చి.ల.సౌ. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి, అమ్మాయి.. కలిసి ఓ రోజు చేసే జర్నీ ఈ సినిమా. పెళ్లి చూపుల్లో ‘నో’ చెప్పుకున్న వాళ్ళు చివరికి ‘యస్’ చెప్పుకుని ఎలా పెళ్లి చేసుకున్నారో చూపించనున్నారు. సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. పెళ్లి విశిష్టతని చెప్పడంతో పాటు… పెళ్లి తంతులు, వాటి ప్రాధాన్యం గురించి వివరించడానికి వస్తోన్న మరో మూవీ శ్రీనివాస కళ్యాణం. నితిన్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో హడావుడి చేయనుంది. సో ఈ పెళ్లి సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి.