ఇండస్ట్రీకి హిట్ సినిమా ఇచ్చాక… దర్శకుల వెనుక నిర్మాతలు పడటం కొత్తేం కాదు. చాలాఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఇలా భారీ మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. చాలామంది అడ్వాన్స్‌లు ఇస్తుంటారు కాబట్టి… దర్శకులు అన్నీ చూసుకొని వరుసగా సినిమాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఒకరి సినిమా ముందు, మరొకరి సినిమా తర్వాత అవుతుంది. కొన్నిసార్లు ముందుగా అడ్వాన్స్ తీసుకున్నవారికి సినిమా చేయడం ఆ దర్శకుడికి కుదరకపోవచ్చు. లేదంటే వేరే ఇంకేదైనా కారణం ఉండొచ్చు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే… కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఇలాంటి పంచాయతీలు రెండు జరిగాయి కాబట్టి.
‘ఇండియన్ 2’సినిమా మధ్యలో వదిలేసి శంకర్ వేరే సినిమా చేస్తున్నాడని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఏకంగా కోర్టుకెక్కింది. అక్కడ తేలకపోవడంతో నిర్మాతల మండలికి వచ్చింది. ఇది ఇంకా మరచిపోక ముందే లింగుస్వామి ఇష్యూ బయటకు వచ్చింది. తమ బ్యానర్‌లో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న లింగుస్వామి ఇప్పుడు రామ్‌తో సినిమా చేస్తున్నారు… ముందు మాకే చేయాలి అంటూ నిర్మాత జ్ఞాన్‌వేల్‌రాజ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి లేఖ రాశారు. దీంతో మళ్లీ దర్శకుడు x నిర్మాత టాపిక్ వచ్చింది.
కూర్చుని మాట్లాడితే తేలిపోయే ఇలాంటి విషయాలను దర్శకులు ఎందుకు సాగదీస్తున్నారు, నిర్మాతలు మండలి వరకు ఎందుకు వస్తున్నారు అనేది తెలియడం లేదు. శంకర్ విషయానికొస్తే… సినిమా విషయంలో నిర్మాతకు, ఆయన కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇక లింగుస్వామి విషయంలో ఏమైందో తెలియదు. ఆయన కథ సిద్ధం చేసి నిర్మాణ సంస్థకు చెప్పారా లేదా అనేది తెలియడం లేదు. కానీ విషయం ఇంతవరకు రాకుండా ఉంటే మంచిది.