Tollywood MAA: ‘మా’ సొంత భవనం ఆలస్యానికి ఇదేనా కారణం!

మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు ఇంకా సుమారు మూడు నెలలు ఉంది. అయితే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్న చందాన… ఈసారి పోటీదారులు ముందే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అప్పటికి ఎన్నికలు జరుగుతాయా… కరోనా జరగనిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అది పక్కనపెడితే… ఎప్పట్లాగే ఈ సారి కూడా ఎన్నికల ప్రధాన అంశం ‘మా’కు సొంత భవనం. అసలు ‘మా’ సభ్యులు తలచుకుంటే… సొంత భవనం పెద్ద పని కాదు. కానీ ఎందుకవ్వడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ఓ కారణం కీలకమైంది అంటున్నారు.

చాలా ఏళ్ల క్రితం ‘మా’కు సొంత భవనం కావాలని… అందుకు స్థలం కావాలని ప్రభుత్వాన్ని సంప్రదించారట. అది కూడా ప్రస్తుతం ఫిల్మ్‌ఛాంబర్‌కు దగ్గర్లోనే. అంటే జూబ్లీహిల్స్‌ ఆ పరిసరాల్లో అన్నమాట. ఇప్పుడు అక్కడ ‘మా’ భవనం కోసం స్థలం అంటే వందల కోట్లు ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో పలికే స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పడు ముందుకొస్తుందా? అనేది ఓ డౌట్‌. అది కూడా పక్కనపెట్టేద్దాం.

ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలిచారు అనుకుందాం. అందరూ కలసి ప్రభుత్వం దగ్గరకు వెళ్లి స్థలం సంపాదించారు అనుకుందాం. కొన్ని రోజులకు శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేసి భవనం కట్టేశారనుకుందాం. ఎలాగూ అన్ని చిత్రపరిశ్రమల కంటే మంచి భవనం కట్టాలని మనవాళ్లు అనుకుంటున్నారు. అంత సూపర్‌ స్పెషాలిటీ భవనం కట్టాక దానికి ఎవరో ఒకరి పేరు పెట్టాలి కదా. ఆఁ.. అక్కడే వచ్చింది అసలు సమస్య. ఆ పేరు ఎవరిది… అనేదే సమస్య.

‘మేమంతా ఒకటే’ అని మన హీరోలు, నటులు చెప్పుకున్నా ఇలాంటి సందర్భాల్లో అసలు మాట బయటికొస్తుంది. గతంలో ఒకసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు సీనియర్‌ హీరోల పేర్లు బయటికొచ్చాయి. ఆ తర్వాత ఎందుకొచ్చిన సమస్య అనుకున్నారేమో.. అది ఆగిపోయింది. పోనీ బిల్డింగ్‌కు ‘మా’ అని పేరు పెడతారు. లోపల కార్యాలయాలకు వేర్వేరు పేర్లు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా ‘పేరు’ సమస్య వస్తుంది. ఇదంతా చూస్తుంటే… ఈ భయంతోనే ‘మా’ భవనం పనులు ముందుకెళ్లడం లేదా?

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus