ఎప్పుడో 2027లో వస్తుంది అంటున్న ‘వారణాసి’ సినిమా గురించి ఇప్పుడు ఈవెంట్ చేయడమేంటి అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఇది కేవలం సినిమా టీమ్ పరిచయం, ఒక విధంగా చెప్పాలంటే సినిమా చేస్తున్నాం అనే విషయాన్ని అధికారికంగా చెప్పడమే అని చెప్పొచ్చు. అయితే సినిమా విడుదలకు చాలా నెలలు ఉంది కాబట్టి.. ఇప్పట్లో సినిమా టీమ్ నుండి ఎలాంటి సర్‌ప్రైజ్, అనౌన్స్‌మెంట్‌లు ఉండవు అని అనుకున్నారంతా. కానీ మహేష్‌బాబు లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టు చూస్తుంటే త్వరలో ఇలాంటి ఇంకో ఈవెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’. గ్లోబ్‌ట్రాటర్ అనేది ప్రపంచ మీడియా కోసం ఉంచుతారు అని అంటున్నారు. ఆ విషయం తర్వాత తేలుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు తన అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ నోట్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా దూరం నుండి వచ్చి, మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని రాశారు.
అక్కడితో ఆపేసి ఉంటే ఎలాంటి డౌట్ రాకోయేది. కానీ ఆఖరులో అతి త్వరలోనే మరోసారి కలుద్దాం అని అందులో ప్రస్తావించారు. ఇక ‘వారణాసి’ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ముందు కూడా ‘ముందు ముందు ఇంకా చాలా ఈవెంట్‌లు ఉంటాయి’ అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే రాజమౌళి తన బ్రాండ్‌ను, సినిమాను ప్రమోట్ చేయడానికి మరో ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అర్థమవుతోంది. అయితే అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఇక్కడ పాయింట్.
ఎందుకంటే గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ఇబ్బందికర పరిస్థితుల్లో జరిగింది. ప్రేక్షకులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి ఈవెంట్ దగ్గరకు రావాల్సి వచ్చింది. ఇక ముందు రోజు ఎవరో డ్రోన్‌తో వీడియో తీసి లీక్ చేసేశారు. ఇక గ్లిచ్‌ల కారణంగా పెద్ద స్క్రీన్ మీద ప్లే చేయలేకపోయారు. హోస్ట్‌ల్లో ఒకరు మధ్యలో జంప్ అయిపోయారు. కాబట్టి ఈసారి ఈవెంట్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.