‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత అభిమానులు, ప్రేక్షకుల ఆలోచనలు ఒకలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీకి సానుభూతి పరుల ఆలోచనలు, వాదనలు ఇంకోలా ఉన్నాయి. ఆ సినిమా కోసం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారు అంటూ ఆరోపించారు. ప్రభుత్వంలో ఉండేవారు సినిమాల్లో నటించకూడదు అనే వాదన కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఓ మాజీ ఐఏఎస్ ఒకరు హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇటీవల వాదనకు వచ్చింది. ఈ క్రమంలో అలనాటి ఎన్టీఆర్ కేసు ప్రస్తావన వచ్చింది.
హరిహర వీరమల్లు’ సినిమా, వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు పవన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాత్ర ఉన్నట్లు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బాల వాదిస్తూ.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని కోరారు.
ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే పవన్ కేసు విషయంలో పిటిషనర్ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదని వాదించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి ప్రతి వాదనలు చెప్పేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరారు.
దీంతో రిప్లై వాదనల కోసం విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తెలిపారు. దీంతో పవన్ విషయంలో వేసిన కేసు విషయం తేలడానికి 15వ తేదీ వరకు ఆగాల్సిందే..