అక్కినేని నాగార్జున 100వ సినిమా మరో ‘మనం’ కాబోతోందా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. దాదాపు 2 ఏళ్ళ నుండి ‘Nag 100’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి.. నాగార్జున ఏమాత్రం కంగారు పడకుండా.. చాలా మంది స్టార్ దర్శకుల పేర్లు పరిశీలించి, 50 కి పైగా నెరేషన్స్ విని ఫైనల్ గా తమిళ దర్శకుడు రా కార్తీక్ చెప్పిన కథకు ఓకే చెప్పారు.వాస్తవానికి నాగార్జున పుట్టినరోజు నాడే ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ పెద్దగా చప్పుడు లేకుండా దసరా పండుగ నాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కూడా ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘నిన్నే పెళ్ళాడతా’ ‘సిసింద్రీ’ ‘ఆవిడా మా ఆవిడే’ వంటి క్రేజీ సినిమాలు వచ్చాయి. ఇదిలా ఉండగా..ఈ సినిమా కథ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన ఓ యాక్షన్ మూవీ అని తెలుస్తుంది. రా కార్తీక్ ఐడియా నాగార్జునకి బాగా నచ్చడంతో దాదాపు 2 ఏళ్ళ పాటు అతను ఈ ప్రాజెక్టు పై వర్క్ చేస్తూ వచ్చాడట.
ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం కనబరుస్తారని తెలుస్తుంది. అంతేకాదు అమల కూడా ఓ చిన్న అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే అక్కినేని నాగ చైతన్య, అఖిల్ కూడా స్పెషల్ రోల్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. అలా అయితే ఇది మరో ‘మనం’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2026 సమ్మర్ కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.