మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగి పది నెలల గడుస్తోంది. అయితే ఆ ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన హామీ, కాన్సెప్ట్ విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా పడలేదు. అదేనండీ.. ‘మా’కు కొత్త భవనం. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య చిన్నపాటి యుద్ధంలా జరిగిన ఆ ఎన్నికల్లో ‘మా’ భవనం గురించే అంతా మాట్లాడుకున్నారు. మా ప్యానల్ అధికారంలోకి రాగానే భవనం కట్టించేస్తాం అని చెప్పిన మంచు విష్ణు.. ఇప్పుడు ఆ విషయంలో ఎక్కడా స్పందించడం లేదు.
ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అని అనుకుంటున్నారా? తమిళ సినీ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం కొత్త భవనం కోసం సూర్య, కార్తీ రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. దీంతో ‘మా’ భవనం గురించి మళ్లీ చర్చ రేగింది. స్థలం చూసేశాం.. పనులు వేగంగా మొదలెట్టేస్తాం అని మంచు విష్ణు ‘మా’ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియో గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. మరి దీనిపై మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఏమంటారో చూడాలి.
ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రస్తుతం ‘మా’ భవనం ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ‘మా’ కోసం ఓ భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల (?) వల్ల ఆ భవనం అమ్మేశారు. ఆ తర్వాత నుండి కొత్త భవనం గురించి చర్చ నడుస్తూనే ఉంది. కొన్ని ప్యానల్స్ అధికారంలోకి వచ్చి దిగిపోయినా.. ‘కొత్త భవనం’ మాత్రం నినాదం, ప్రచారం, మేనిఫెస్టోల్లో మిగిలింది. అయితే గత ఎన్నికల్లో మంచు విష్ణు మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా.. సొంత డబ్బులతోనే నిర్మిస్తా అని చెప్పారు.
అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి సగం టర్మ్ పూర్తవుతున్నా.. ఇంకా భవనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. కనీసం ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా అయినా సరే భవనం గురించి ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి. అన్నట్లు సూర్య – కార్తి లాగా మన హీరోలు కూడా భవనం గురించి ఏమన్నా విరాళం ఇస్తారేమో చూడాలి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?