అయితే హిట్టు.. లేదంటే ఫట్టు.. మధ్యలో ఇంకో రిజల్టే ఉండదు. అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మాత్రమే. ఎందుకో కానీ ఆయన సినిమాలు అలానే ఉంటాయి. తాజాగా ఆయన నుండి వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) పరిస్థితి రెండో రకం. దీంతో పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఆయనకు ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చేది ఎవరు? అనే డిస్కషన్ ఎప్పుడూ ఉండేది కాబట్టే.
‘లైగర్’ (Liger) సినిమా తర్వాత పూరి జగన్నాథ్ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత కూడా అలానే ఉంది అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే ఇంకాస్త ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. ఇద్దరు యువ హీరోలకు ఇబ్బందికర సినిమాలు ఇవ్వడంతో.. ఈ సారి పూరికి ఛాన్స్ ఇచ్చే యువ హీరో ఎవరైనా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. దీనికి అయితే కష్టమే అనే సమాధానం సినిమా పరిశ్రమ వర్గాల నుండి వస్తోంది.
దీంతో సీనియర్ హీరోల్లో ఒకరు పూరి నెక్స్ట్ హీరో అవ్వొచ్చు అని అంటున్నారు. ఈ క్రమంలో తొలుతగా వినిపిస్తున్న పేరు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). నిజానికి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు ముందే ఆయన కోసం ఓ కథ రాసుకున్నారని టాక్. కానీ ఈ సినిమా ఓకే అవ్వడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పనులు స్టార్ట్ చేస్తారేమో అనే చర్చ నడుస్తోంది.
ఇక ఆయన నో అంటే.. మరో ఆప్షన్ చిరంజీవి (Chiranjeevi) . ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమా సమయంలో ‘నా కోసం ఓ కొత్త కథ రాసుకురా.. సినిమా చేద్దాం’ అని చిరంజీవి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు రెడీ అన్న పూరి.. ఇప్పుడేమైనా ఆ ఆలోచన చేస్తారేమో చూడాలి. ఈ ఇద్దరూ కాదంటే మూడో ఆప్షన్ నాగార్జున (Nagarjuna) అని అంటున్నారు. చూడాలి మరి పూరి తరువాతి స్టెప్ ఏంటో?