ధనుష్ కొత్త సినిమా అంటూ DxV అనే పోస్టర్లు గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందుకే D, V అనే రెండు అక్షరాలు తప్ప ఇంకేమీ లేవు. దీంతో ఈ సినిమా గురించి ఎవరికి నచ్చిన పుకార్లు వారు క్రియేట్ చేసుకుంటున్నారు. ధనుష్ చేయబోయే నెక్స్ట్ సినిమా టైటిల్ V అనే అక్షరంతో మొదలవుతుందని, లేదంటే V అనే అక్షరంతో పేరు మొదలయ్యే దర్శకుడితో ఆ సినిమా ఉండొచ్చు అంటూ కొత్త కొత్త చర్చలు పెడుతున్నారు. వాటన్నింటిని ఒక దగ్గర పేరిస్తే..
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న దర్శకులు, ధనుష్‌తో సినిమా చేయగలిగే అవకాశం ఉన్న దర్శకులు, ఇతర భాషల్లో ఆ అవకాశం ఉన్న దర్శకుల లిస్ట్‌లో V అనే పేరు ఉన్నవారిని చూస్తే.. వెంకట్ ప్రభు, వెట్రి మారన్ లాంటి వారి పేర్లు కనిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు నుండి సినిమా వచ్చి చాలా రోజులు అయింది. గతంలో ఓసారి ధనుష్‌ని కలిశారని టాక్ కూడా ఉంది. వెట్రి మారన్ – ధనుష్ ప్రాజెక్ట్ చాలా ఏళ్ల నుండి వినిపిస్తూనే ఉంది. కానీ ఓకే అవ్వడం లేదు. ఇక్కడే మరో V ఉంది. ఆయన బాలీవుడ్ నుండి.
బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే ధనుష్.. విధు వినోద్ చోప్రాతో ఓ సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. అది ఇదే కావొచ్చనే టాక్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్‌లో ఎలాంటి బజ్ లేకపోవడం గమనార్హం. ఇక సినిమా పేర్ల పరంగా చూస్తే.. శంకర్ ‘వేల్పారి’ ఉంది. ఈ కథ గురించి శంకర్ టీమ్ చాలా ఏళ్లుగా చెబుతోంది. చాలామంది హీరోల పేర్లు వినిపించాయి. ఆ కథ ఏమన్నా ధనుష్ దగ్గరకు వచ్చిందా అనేది చూడాలి.
ఒక్క మాట అయితే నిజం. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నారు అని సమాచారం.