‘బలగం’ సినిమాతో తెలంగాణ మట్టి వాసనను భారతీయ సినిమాకు మరోమారు పరిచయం చేసిన దర్శకుడు వేణు యల్దండి. ఆ సినిమా తర్వాత ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అధికారికంగా ఈ సినిమాను పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించకపోయినా వివిధ సందర్భాల్లో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు చెబుతూ వచ్చారు. ఇప్పటికే ఇద్దరు హీరోలు మారి మూడో హీరో ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అయితే మూడో హీరో కూడా ఇప్పుడు పక్కకు తప్పుకున్నారు అని సమాచారం.
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా తొలుత నానిని అనుకున్నారు. దీనికి సంబంధించి చాలా పనులు కొంత దూరం కూడా వెళ్లాయి. కానీ ఏమైందో ఏమో నాని ఈ సినిమా నుండి తప్పుకున్నారు. అప్పుడు మరో హీరో పేరు చర్చల్లోకి వచ్చింది. (ఆ పేరు ఇప్పుడు చెప్పకపోవడానికి కారణం ఉంది). ఆ వెంటనే సినిమా నితిన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్‌లో నితిన్ ‘తమ్ముడు’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఫలితం కారణంగా ‘ఎల్లమ్మ’ సినిమా నుండి నితిన్ తప్పుకున్నాడు అంటున్నారు.
తప్పుకోవడానికి కారణాలేంటి అనేది తెలియదు కానీ.. ఆయనైతే ప్రోజెక్ట్‌లో లేడట. తిరిగి పైన చెప్పిన రెండో హీరో శర్వానంద్ ఇప్పుడు తిరిగి ఫ్రేమ్ లోకి వచ్చాడట. ఈ మేరకు దిల్ రాజుతో చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఒకవేళ శర్వా ఓకే కాకపోతే తమిళ హీరోను ఓకే చేసుకోవాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారట. ఈ మేరకు దర్శకుడు వేణుతో కూడా మాట్లాడారు అని సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతోంది. ‘బలగం’ సినిమా తరహాలోనే మానవ సంబంధాల నేపథ్యంలో సినిమాను రూపొందించనున్నారట. ఈ మేరకు దర్శకుడు వేణు పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసుకున్నారట. కానీ హీరో తేలక ఆలస్యమవుతోంది. దీని వెనుక మరో కారణం బడ్జెట్‌కు తగ్గ ఇమేజ్ ఉన్న హీరో కావాలని చూస్తున్నారట.