కల్ట్ సినిమాలకు సీక్వెల్ చేయడం అంత మంచిది కాదు.. కావాలంటే రీరిలీజ్‌లు చేసుకోండి అని అంటున్న రోజులవి. ప్రేక్షకులు కూడా ఈ విషయంలో ఇంచుమించు అంటున్నారు. అయితే కొన్ని కల్ట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తే బాగుండు అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా అనుకుంటూనే ఉన్నారు. వాటిల్లో ‘శివ’ సినిమా ఒకటి. టెక్నికల్‌గా, కథనం పరంగా టాలీవుడ్ నడతో పూర్తిగా మార్చేసిన సినిమా అది. ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మకు రీమేక్ ప్రశ్న ఎదురైంది.
‘శివ’ సినిమా రీమేక్ ఎవరితో తీస్తారు చెప్పండి అని మీడియా అడిగితే.. దానికి నాగార్జున అభిమానులు ఎంతగానో ఆనందించే రిప్లై ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ‘మళ్లీ ‘శివ’ తెరకెక్కించాల్సి వస్తే ఎవరితో తీస్తారు?’ అని అడగ్గా.. ‘శివ’ సినిమా కేవలం నాగార్జున కోసమేనని, ఆయన్ను తప్ప ఆ పాత్రలో మరొకరని ఊహించుకోలేను అని ఆర్జీవీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. దీంతో ఆ సినిమాను మరోసారి కొత్త ముఖాలతో చూద్దాం అనుకునేవారు తమ ఆలోచనల్ని ఇక ఆపేసే సమయం వచ్చింది.
పోనీ ఆ సినిమా సీక్వెల్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? నాగచైతన్య, అఖిల్‌లో ఎవరిని హీరోగా తీసుకుంటారు? అని అడిగితే.. ఆ ఇద్దరూ కాదని సమాధానమిచ్చారు. అయితే ఎవరితో చేస్తారనే విషయం మాత్రం చెప్పలేదు. ఇక ఆ సినిమా అప్పుడెందుకు అంతగా ఆదరణకు నోచుకుంది అనే విషయం కూడా వర్మ చెప్పారు. ఇప్పుడు ఏ సినిమాలోనూ హీరో టెన్షన్ పడే సన్నివేశాలు ఉండటం లేదు. ఇంట్రడక్షన్ సీన్ లేదా సాంగ్‌తోనే ఏదైనా చేసేస్తాడని చెప్పకనే చెబుతున్నారు అని అన్నారు వర్మ. ‘శివ’ సినిమాలో కథానాయకుడు సాధారణ వ్యక్తి. అలా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఆ తరహా ప్రయత్నాలు ఎవరూ చేయట్లేదు. అందుకే అందరూ మళ్లీ ‘శివ’కు మీరు కనెక్ట్ అవుతారు అని వర్మ అన్నారు.