బిగ్‌బాస్‌ చెప్పేది వీళ్లకి ఎప్పటికీ అర్థం కాదా?

బిగ్‌బాస్‌ సీజన్లను ఫాలో అవుతున్నవారికి ‘హోటల్‌’ టాస్క్‌ పెద్ద కొత్తేం కాదు. అయితే ఈ సీజన్‌లో మంగళవారం మొదలైన హోటల్‌ టాస్క్‌… అయోమయం, అదోరకంగా సాగుతోంది. మంచిగా సర్వీసు అందించి, స్టార్లు సంపాదించండి అని బిగ్‌బాస్‌ చెబితే… ఇంటి సభ్యులకు ఆ విషయం అర్థమైనట్లు లేదు. ఇదిలాగే సాగితే మరో ఫ్లాప్‌ టాస్క్‌గా మారడం ఖాయం. ఇంతకీ ఏమవుతోందంటే?

హోటల్‌ టాస్క్‌ ఇచ్చేటప్పుడు ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించి, కొందరిని హోటల్‌ సిబ్బందిగా, ఇంకొందరిని హోటల్‌కు వచ్చే అతిథులుగా మారుస్తారు. అతిథులకు మంచి సర్వీసు చేసి… హోటల్‌ సిబ్బంది రేటింగ్‌ (స్టార్లు) సంపాదించాలి. ఐదు స్టార్లు సంపాదిస్తే హోటల్‌ సిబ్బంది గెలిచినట్లు… ఐదు స్టార్లు అందుకోకపోతే అతిథులు గెలిచినట్లు. మంగళవారం కూడా బిగ్‌బాస్‌ ఇదే మాట చెప్పాడు. అయితే హోటల్‌ టీమ్‌ గెలవకుండా చూడాలంటూ అవినాష్‌కు సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు.

ఇక టాస్క్‌ మొదలైనప్పటి నుంచి హోటల్‌ సిబ్బంది ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. సర్వీసు అందించండిరా బాబూ… అతిథుల మీద పంచ్‌లు విసురుతూ నవ్వుకుంటున్నారు. గెస్ట్‌లు అడిగే ప్రతిదానికి ఇప్పుడు కుదరదు… మాకు వీలైనప్పుడు చేస్తాం అంటూ విసురుగా మాట్లాడుతున్నారు. నోయల్‌ మాటమాటకు అడ్డుపడుతూ చిరాకు తెప్పిస్తున్నాడు. అఖిల్‌ కూడా ఇదే పని. అవినాష్‌ ఇవన్నీ చేస్తున్నాడు అంటే సీక్రెట్‌ టాస్క్‌ అనుకోవచ్చు. మిగిలినవారికి ఏమైంది.

గత సీజన్లలో చూస్తే… గెస్ట్‌లు హోటల్‌ సిబ్బందితో ఆడుకున్నారు. మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు హెడ్‌ మసాజ్‌ కావాలి అంటూ విసిగించేవారు. దానికి హోటల్‌ సిబ్బంది ఓపిగ్గా చేసి స్టార్లు సంపాదించేవారు. కానీ ఈ సీజన్‌లో అలాంటి ఆలోచనే కనిపించడం లేదు. ఏమన్నా అంటే స్టార్లు ఎప్పుడో కొట్టేశాం… మన దగ్గరే ఉన్నాయి కదా అంటూ ఓ వెటకారం కూడా చూపిస్తున్నారు. గెలవాలంటే స్టార్లు సంపాదించాలి.. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే గెస్ట్‌లు రేటింగ్‌ ఇవ్వాలి.

స్మార్ట్‌ గేమ్‌ పేరుతో కిడ్నాప్‌లు చేసి మంచి పేరు తెచ్చుకున్న అభిజీత్‌.. ఈసారి అలాంటిదే ప్లాన్‌ చేశాడు. మరి అది వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి. అన్నింటికి మించి సీక్రెట్‌ టాస్క్‌ చేస్తున్న అవినాష్‌ పది పనులు చెడగొట్టాడా లేదా అనేది ఈ రోజు చూడాలి. అన్నట్లు హోటల్‌ సిబ్బంది చేస్తున్న పని చూస్తుంటే గెస్ట్‌లు రేటింగ్‌ ఇచ్చేలా లేరు. మరి ముందే స్టార్లు కొట్టేశారు కాబట్టి బిగ్‌బాస్‌ హోటల్‌ టీమ్‌కే గెలుపు ఇచ్చేస్తాడా? చూద్దాం.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus