కొన్ని తమిళ, మలయాళ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సినిమా బాగుంది అని, దర్శకుడు బాగా చేశాడని, అద్భుతమైన కాన్సెప్ట్ అని తెగ పొగుడుతూనే.. మన తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు తీయరు అని బాధపడుతుంటామ్ కూడా. ఒక్కోసారి మన బాధకు సమాధానంగా సదరు సినిమాలను రీమేక్ చేయడమో లేక డబ్బింగ్ చేయడం కానీ చేస్తుంటారు. కొన్ని సినిమాలను డబ్బింగ్ చేయలేక, రీమేకూ చేయలేక వదిలేస్తుంటారు. అలాంటిదే గతవారం విడుదలైన తమిళ సినిమా “సూపర్ డీలక్స్”. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేషమైన పాజిటివ్ టాక్ వచ్చింది.
ఈ ప్రపంచంలో కో-ఇన్సిడెన్స్ అనేది ఉండదు.. ప్రతి విషయం జరగడానికి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కారణమవుతాయి అనేది సినిమా కాన్సెప్ట్. ఒకరోజులో జరిగే ఈ కథను నాలుగు ముఖ్యమైన పాత్రల చూట్టూ తిప్పాడు దర్శకుడు. మూడు గంటల సినిమా అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సినిమాని నడిపించడం అనేది హైలైట్ గా నిలిచింది. ఇలా పరాయి భాషా సినిమాలు చూస్తూ బాగున్నాయమని చంకలు గుద్దుకోవడమేనా.. మన తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా? అని ప్రతి సగటు సినిమా ప్రేక్షకుడు బాధపడుతున్నాడు. మరి మన తెలుగులో ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.