సినిమా ఫలితం తేడా కొట్టింది అంటే తప్పెవరిది? మామూలుగా అయితే ఆ సినిమాకు పని చేసిన కీలక సభ్యులదే. అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత టీమ్‌లదే. కానీ టాలీవుడ్‌లో మాత్రం సినిమా సినిమాకు ఈ లెక్క మారిపోతూ ఉంటుంది. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోది తప్పు, మరో సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడిది తప్పు, ఇంకో సినిమా పోతే అది నిర్మాత తప్పు. మొన్న జెండా పండగకి వచ్చిన రెండు సినిమాల ఫలితాల తర్వాత ఈ రంగు బయటపడింది.
మనం బాలీవుడ్ పెద్ద సినిమాల ఫలితాల్ని చూసి నవ్వుకుంటున్నాం కానీ.. టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక్కడ కూడా సరైన ఫలితాలు రావడం లేదు. బాలీవుడ్‌లో సినిమాలు పోతున్నాయి అంటే హీరోల కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని అంటున్నారు. మొన్నీమధ్య వరకు అదే అన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుండి డబ్బింగ్ అయి వచ్చిన ‘వార్ 2’ సినిమా ఫలితం తేడా కొట్టేసరికి తప్పు హీరోలది కాదు.. దర్శకుడిది అనేలా మాట్లాడుతున్నారు. ‘కూలీ’ విషయంలోనూ ఇలానే మాట్లాడుతున్నారు.
అంతేకాదు ఆ మధ్య ఓ అగ్ర హీరో, మరో ‘కమర్షియల్ + మెసేజ్’ దర్శకుడు కలసి చేసిన సినిమా పోతే ‘అందులో హీరో ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైంది.. అందుకే పోయింది’ అంటూ కథలు అల్లేశారు. ఆ దర్శకుడు కూడా ఇంచుమించు అలానే చెప్పుకొచ్చారు. అదే కుటుంబానికి చెందిన యువ హీరో సినిమా డిజాస్టర్ రెస్పాన్స్ అందుకుంటే దర్శకుడిదే తప్పు అనేలా మాట్లాడారు. అంతెందుకు ఆ అగ్రహీరో ఆ తర్వాతి సినిమా ఫలితానికి అతనిని, ఆ దర్శకుడిని కూడా విమర్శించారు. అంటే సినిమా బట్టి ‘తప్పు’ అర్థం మారిపోతోంది అనే కదా.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు సినిమా ఫ్లాప్‌లకు ఒక్కో సినిమాకు ఒక్కొక్క విభాగానికి తప్పు ఆపాదించేస్తున్నారు. నిజానికి ఏ సినిమా ఫలితం తేడా కొట్టినా అది మొత్తం టీమ్‌కే చెందుతుంది. విజయం విషయంలోనూ ఇంతే. ఇది తెలుసుకోకుండా ఏ ఒక్కరినో నిందించడం సరికాదు.