‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) సినిమా ప్రపంచం మొత్తం అల్లాడిస్తోంది. (ఇక్కడ ప్రపంచం మొత్తం అంటే సినిమా విడుదలైన ప్రాంతాల్లో అని అనుకోండి) విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లు అందుకుంటోంది అని సినిమా టీమ్ పోస్టర్లతో భారీ వసూళ్లతో చెబుతోంది. అయితే మల్టీప్లెక్స్‌ల విషయంలో ‘పుష్ప’రాజ్ పంచాయితీ తేలడం లేదు. ప్రసాద్స్ స్క్రీన్లతో పంచాయితీ తేలక ఏకంగా అక్కడ సినిమా విడుదలే కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ ఛైన్‌తో పంచాయితీ అయింది.
మనకు పెద్దగా తెలియదు కానీ ఈ నెల 19న రాత్రి పీవీఆర్ వెబ్‌సైట్ / యాప్ ‘పుష్ప: ది రూల్’ సినిమా కనిపించలేదు. ఏమైంది అన్ని స్క్రీన్లలో ఒకేసారి ఎత్తేశారా అని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ముంబయికి మాత్రమే పరిమితమైంది. బాలీవుడ్‌లో రూ.600 కోట్లకుపైగా వసూళ్లతో వేగంగా భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా వందేళ్ల రికార్డును బద్ధలుకొట్టింది కాబట్టే పెద్ద సమస్య. అయితే దేశం మొత్తం ముఖ్యంగా టాలీవుడ్‌లో కూడా జరిగి ఉంటే ఎక్కువమంది తెలిసేది.
ప్రసాద్స్ విషయంలో డబ్బులు షేర్ విషయంలో లెక్కలు తేలకపోవడంతో అక్కడ ‘పుష్ప’రాజ్ తాండవం చూడలేకపోయారు ఫ్యాన్స్. మరి పీవీఆర్ విషయంలో ఏమైందా అని చూస్తే.. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ పంపిణీదారుడు అనిల్ తడాని తమ సినిమాకు మూడో వారంలోనూ పెద్ద సంఖ్యలో స్క్రీన్స్ కావాలని కోరుకున్నారట. అయితే డిసెంబర్ 25న వరుణ్ ధావన్ (Varun Dhawan ) – కీర్తి సురేష్ (Keerthy Suresh) ‘బేబీ జాన్’ (Baby John) వస్తుండటంతో థియేటర్ల సంఖ్య అంత కుదరదని.. తడానీకి క్లారిటీ ఇచ్చేశారట.
ఈ విషయంలో చాలా చర్చలు, ఉపచర్చలు పూర్తి చేసి.. తిరిగి సినిమాను పీవీఆర్‌లోకి తీసుకొచ్చారు. ‘పుష్ప: ది రూల్’కి భారీ వసూళ్లు వస్తుండటం వల్లనే అని తడానీ అన్ని థియేటర్లు అడుగుతున్నారు అని కొందరు అంటుండగా.. అడిగిన థియేటర్లు ఇన్నాళ్లూ ఇచ్చారుగా వాళ్ల సినిమాకు వాళ్ల థియేటర్లే దొరకకపోతే ఎలా అని అంటున్నారు. ఎందుకంటే థియేటర్ల సమస్య మనకు బాగా తెలుసు.