మనిషి మీద ఎంత కోపం ఉన్నా… కష్టంలో ఉన్నాడని, ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిస్తే… అన్నీ మరచిపోయి సాయం చేయాలి అంటారు పెద్దలు. కనీసం సాయం చేయకపోయినా ఆ మనిషికి అంతా మంచే జరగాలని కోరుకున్న చాలు. ఎందుకంటే ఎక్కువమంది ప్రార్థనలు విని, అతను కోలుకుంటాడు అంటుంటారు. అయితే కత్తి మహేష్ విషయంలో కొంతమంది నెటిజన్లు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే.. వీళ్లకు మానవత్వం ఉందా అని అనిపిస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో నటుడు, క్రిటిక్ అయిన కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం అతనికి వైద్యం జరుగుతోంది. దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను అతని స్నేహితులు, సన్నిహితులు కొంతమంది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. అయితే ఆ అప్డేట్స్ కింద ఉన్న కామెంట్లు, కొన్ని పోస్టులను చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించకమానదు. రాయడానికి కూడా చేతులు రాని, టైప్ చేయడానికి వేళ్లు రాని లాంగ్వేజ్‌లో కత్తి మహేష్ మీద విరుచుకుపడుతున్నార కొందరు. ఆయన గతంలో ఓ పార్టీ మీద, ఓ హీరో మీద వరుసగా వ్యాఖ్యలు, విమర్శలు చేసుండొచ్చు.
అదంతా ఆయన ఆరోగ్యంగా, ఎలాంటి ఆపదలో లేనప్పుడు. ఒకవేళ ఆ విషయంలో ఏమన్నా అనాలి అంటే… అప్పుడే అనేసుంటారు కదా. ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అతనికి, అతని కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఈ సోషల్‌కూతలు ఎందుకో అర్థం కావడం లేదు. కత్తి మహేష్ మీద కోపం ఉంటే… ఆయన కోలుకున్నాక ఎన్ని మాటలైనా అనండి. అప్పుడు ఆయన సమాధానం చెప్పాలంటే చెబుతారు. అంతే కానీ ఈ వికృతానందం ఏమాత్రం మంచిది కాదని పలువురు పెద్దలు సూచిస్తున్నారు.