సినిమా మొదలైన 15 నిమిషాల్లోగా మహా అయితే 20 నిమిషాల్లోగా హీరోయిన్ ఎంట్రీ ఉండాలి. లేదంటే సినిమా మీద యూజర్లకు ఆసక్తి ఉండదు అని ఓ తెలుగు అగ్ర దర్శకుడు చెప్పారు. కానీ అసలు హీరోయిన్ లేకుండానే కొన్ని సినిమాలు వస్తున్నాయి, భారీ విజయాలు సాధిస్తున్నాయి. ‘అన్ని సినిమాల్లో హీరోయిన్లు ఉండాలా ఏంటి? సినిమాకు తగ్గట్టుగా పాత్రలు ఉంటాయి’ అని మీరు అనొచ్చు. అయితే అవకాశం ఉన్నా ఆ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు పెట్టడం లేదు. ఒకవేళ ఉన్నా స్పెస్ ఉండటం లేదు. ప్రాధాన్యత కూడా ఉండటం లేదు
అయితే, ఇది జరుగుతోంది మన దగ్గర కాదు, మలయాళ సినిమా పరిశ్రమలో ఇలా జరుగుతోంది. మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతోనే బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతోంది. థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లోనూ విశేష ఆదరణ దక్కుతోంది. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ వస్తున్న సినిమాల్లో మహిళా పాత్రల ప్రాధాన్యత పెద్దగా ఉండటం లేదు. టొవినో థామస్ ప్రధాన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘అన్వేషిప్పిమ్ కండెతుమ్’ సంగతి చూస్తే.. హీరోయిన్ లేదు.
ఆయన మరో సినిమా ‘నడికార్’లోనూ భావన పాత్ర గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. జయరామ్ (Jayaram) , మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రల్లో నటించిన ‘అబ్రహం ఓజ్లర్’ మీరు చూసే ఉంటారు. అందులో మహిళా ప్రధాన పాత్రలు ఉన్నప్పటికీ, వారికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించిన ‘ఆడుజీవితం – ది గోట్ లైఫ్’ (The Goat Life) సినిమాలో అమలా పాల్ (Amala Paul) ఉన్నప్పటికీ ఎక్కవగా కనిపించే పరిస్థితి లేదు. నివిన్ పౌలీ (Nivin Pauly) ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’ సినిమాలో మహిళల పాత్రలకు ప్రాధానత్య లేదు.
అనశ్వర రాజన్ లాంటి ప్రముఖ నటి ఉన్నప్పటికీ, ఆమెది సినిమాలో కేవలం 10 నిమిషాలే కనిపిస్తారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) సినిమానే తీసుకోండి అందులో మహిళా ప్రధాన పాత్రలు కనిపించవు. ఇక షెకావత్ సర్ సినిమా ‘ఆవేశం’ సినిమాలోనూ ఇంతే. ఈ సినిమాలో హీరోయిన్ లేదు. సినిమాలో ఇతర కీలక పాత్రధారులకూ జోడీ లేదు. మమ్ముట్టి ప్రయోగాత్మక చిత్రం ‘భ్రమయుగం’ సంగతి అయితే సరేసరి. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ మాత్రమే ప్రధాన పాత్రధారులు. అదేంటి అమల్డా లిజ్ ఉంది కదా అనొచ్చు.. ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు.