Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

ఓ సినిమా విజయం సాధిస్తే.. మొత్తం పరిశ్రమ పండగ చేసుకుంటుంది అని అంటుంటారు. అందులోనూ చిన్న సినిమా విజయం సాధిస్తే ఇంకాస్త ఎక్కువగా పండగ చేసుకుంటారు అని అంటుంటారు. గ్రౌండ్‌ రియాలిటీకి దగ్గరగా ఉన్నవాళ్లు అయితే పండగ చేసుకోవాలి అని అంటుంటారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.. ఒక సినిమా అందులో చిన్న హీరో సినిమా విజయం సాధిస్తే మన స్టార్‌ హీరోలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే అది కొంతమంది సినిమాలకేనా? ఏమో ఇప్పుడు టాలీవుడ్‌ పరిస్థితి చూస్తుంటే ఇలానే అనిపిస్తోంది.

Mirai

మౌళి – శివాని నాగారం ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా గురించి టాలీవుడ్‌లో రోజుకో సెలబ్రిటీ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. సినిమాను, టీమ్‌ను తెగ మెచ్చేసుకుంటున్నారు. ఆ సినిమా సాధించిన విజయం చూశాక అలా ఎవరు మెచ్చుకున్నా అది పర్‌ఫెక్ట్‌ రియాక్షన్‌ అనే చెప్పాలి. అయతే ఆ సినిమాను మించిన వసూళ్లతో దూసుకుపోతున్న చిన్న హీరో పెద్ద సినిమా గురించి టాలీవుడ్‌ ‘అగ్ర’ జనాలు పెద్దగా రియాక్ట్‌ అవ్వడం లేదు. ఆ సినిమా నిర్మాణ సంస్థతో కలసి సినిమాలు చేస్తున్న, చేసిన హీరోలు కూడా రియాక్ట్‌ అవ్వకపోవడం ఆశ్చర్యంగా అఇపిస్తోంది.

‘మిరాయ్‌’ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ టాలీవుడ్‌లో చాలామందికి సన్నిహితులు. గతంలో ఇక రిలీజ్‌ అవ్వడం కష్టం అనే పరిస్థితిలో పడిన చాలా సినిమాలను టేక్‌ ఓవర్‌ చేసి పూర్తి చేసి రిలీజ్‌ చేశారు. మరికొన్ని సినిమాల విషయంలో ఆ పనిలో ఉన్నారు. అందులోనూ ఆయనకు చాలా రోజుల తర్వాత విజయం వచ్చింది. కనీసం ఆయన కోసమేనా పోస్టులు చేయొచ్చు కదా.. సినిమాను మెచ్చుకోవచ్చు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోనీ హీరో పరంగా చూసుకున్నా తేజ సజ్జా అందరికీ సన్నిహితుడే.

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా చూడటానికి సమయం వెచ్చించిన మన స్టార్‌ హీరోలు, సెలబ్రిటీలు ‘మిరాయ్‌’ సినిమా కోసం అంత టైమ్‌ ఇవ్వలేకపోతున్నారా? లేక గతంలో ఏదో జరిగి అది మనసులో పెట్టుకుని సినిమాను ప్రోత్సహించడం లేదా అనేది తెలియడం లేదు. మంచి సినిమా ప్రోత్సహించమని ప్రేక్షకుల్ని కోరే మన సెలబ్రిటీ స్టార్లు.. తాము ప్రోత్సహించకపోతే ఎలా? చూద్దాం ఈ వీకెండ్‌లో ఏమన్నా చూసి మాట్లాడతారేమో.

 మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus