తేజ సజ్జాను చూస్తే చిన్న కుర్రాడిలా ఉంటాడు. అలా అని ఆ లుక్‌కి తగ్గట్టుగా చాక్లెట్ బాయ్ జోనర్ సినిమాలు కాకుండా.. సూపర్ హీరో సినిమాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘హను – మాన్’తో సినిమా సంపాదించుకున్న సూపర్ హీరో ఇమేజ్‌ను రీసెంట్‌గా ‘మిరాయ్’ సినిమాతో వచ్చి పెంచేసుకున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమా విషయంలోనూ ఇలాంటి ఆలోచననే చేస్తున్నాడట. కొత్త సినిమాల విషయంలో ఇలాంటి కాన్సెప్ట్‌లకే పెద్ద పీట వేస్తున్నాడట. అలా ఓ కొత్త సినిమా ఓకే చేశాడు అని సమాచారం.
తేజ సజ్జా కొత్త సినిమా ఒకటి ఇటీవలే అనౌన్స్ అయింది. తన హిట్ సినిమా ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌ను ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఈసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో తెరకెక్కిస్తామని తెలిపారు. దర్శకుడు మల్లిక్‌తో కలసి తేజ ఓ సినిమా చేయబోతున్నాడట. మల్లిక్, తేజ కాంబినేషన్‌లో గతంలో ‘అద్భుతం’ అనే సినిమా వచ్చింది. థియేటర్లలో రాని ఆ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు. సోషియో + ఫాంటసీ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తారని తెలుస్తోంది. అలా మరోసారి సూపర్ హీరో ప్లాన్ చేశాడట.
‘మిరాయ్’ సినిమా తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథలో తేజ సజ్జా కనిపిస్తాడని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఆయన లైనప్ చూస్తే రాబోయే మూడు సినిమాలు సూపర్ హీరో కాన్సెప్ట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే ‘జై హనుమాన్’, ‘జాంబీ రెడ్డి 2’. ఇప్పుడు మల్లి సినిమా ఇలా అన్నీ సూపర్ హీరో, సోషియో ఫాంటసీ టచ్‌లోనే రానున్నాయి. మరి ముఖం మొత్తేయకుండా తేజ సజ్జా తన సినిమా లైనప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఒకే గాటకు హీరోను ఒకసారి కడితే ఇక అక్కడ ఉండిపోవాల్సిందే. సీనియర్ మోస్ట్ చైల్డ్ యాక్టర్ అయిన తేజకు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.