ఇది ఓ రెండుమూడేళ్ల క్రితం విషయం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నారని అప్పుడే వార్తలొచ్చాయి. కొన్ని రోజులు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయి, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి కొన్ని రోజులకు ఈ సినిమాలో ప్రతి సినిమా పరిశ్రమ నుండది ఓ అగ్ర హీరో నటిస్తారని లీకులు వచ్చాయి. అందుకుతగ్గట్టే నటించారు కూడా. మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుండి శివ రాజ్‌కుమార్ కనిపించారు. బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ కూడా నటించారు. అయితే తెలుగు నుండి ఏ స్టార్ హీరో కూడా నటించలేదు.
Jailer 2
సినిమాలో ఓ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను అడిగారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అవ్వలేదు. ఈ విషయాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దగ్గర ప్రస్తావిస్తే.. అవును అనుకున్నాం అని చెప్పీ చెప్పనట్లు చెప్పారు. ఇప్పుడు ‘జైలర్ 2’ అంటూ మరోసారి రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కలసి ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అగ్ర హీరోలు ఇతర పరిశ్రమ నుండి వచ్చి నటిస్తారు అని చెబుతున్నారు. అనుకున్నట్లుగా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ ఉంటారని తేలిపోయింది. ఇప్పుడు కూడా తొలి పార్టు పరిస్థితే.
‘జైలర్ 2’ సినిమాలో బాలయ్య నటిస్తాడు అని ఆ మధ్య పెద్ద చర్చే జరిగింది. అయితే ఆయన నటించడం లేదు అని తేలిపోయింది. మరీ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి విషయాన్ని దాస్తే తప్ప.. ఇప్పటికే ఆయన సినిమాలో లేరు. ఆయన స్థానంలో హీరోను ఈ సారి బాలీవుడ్ నుండి తీసుకొస్తున్నారు అని సమాచారం. మోహన్‌లాల్, మమ్ముట్టి పాత్రల తరహాలోనే షారుఖ్ ఖాన్ కూడా నటిస్తాడు అని అంటున్నారు. ఈ మేరకు ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చారు.
‘జైలర్ 2’ సినిమా భారీ స్థాయిలో రానుందని, ఇందులో షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు అని చెప్పేశారు. దీంతో అసలు విషయం లీకైంది. ఆయన మాటల్లో ఎక్కడా తెలుగు హీరో పేరు వినిపించలేదు. ఒక ఆయన చెప్పింది నిజమైతే.. గతంలో రజనీకాంత్ చేసిన ఫేవర్‌ను తిరిగి చేసి థ్యాంక్యూ చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే ‘రా వన్’ సినిమాలో తలైవా అతిథి పాత్ర వేశాడు. మొన్నీమధ్యే ‘కూలీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.