Tollywood: మీ కిందకే నీళ్లొస్తున్నాయ్‌… అర్థమవుతోందా?

పక్క ఇల్లు తగలబడుతుంటే… మన ఇంటికి మంటలు అంటుకోలేదు కదా అని ఆగేవాళ్లను చూసుంటాం. కానీ ఇంటిలో పక్క గదికి మంటలు అంటుకుంటే… మా గదికి రావులే అనుకోము కదా. కానీ టాలీవుడ్‌ జనాలను చూస్తుంటే ఇలానే అనుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఇదంతా సినిమాటోగ్రఫీ చట్ట సవరణల గురించి చెబుతున్నాం. ప్రతీ విషయంలోనూ.. తమ పెత్తనం ఉండేలా చూసుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో సినిమా పరిశ్రమపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సినిమాటోగ్రఫీ చట్ట సవరణలు అని సినీ ప్రముఖులు కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు టాలీవుడ్‌ నుండి ఎవరూ స్పందించలేదు.

కేంద్రం తీసుకొస్తుంది అంటున్న సవరణ వల్ల సినిమా ప్రదర్శలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే అధికారం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో బాలీవుడ్‌లో కొందరు బహిరంగంగానే వ్యతిరేకత తెలిపారు. ఇక పక్కనే ఉన్న తమిళ పరిశ్రమ నుంచి కమల్ హాసన్‌, సూర్య, సిద్ధార్థ లాంటి వాళ్లు మాట్లాడారు. ఈ చట్టం సినీ పరిశ్రమ స్వేచ్ఛను హరిస్తుందని అంటున్నారు. అందుకే కొత్త సవరణల అమలు నిలిపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ పోరులో టాలీవుడ్‌ గొంతు వినిపించడం లేదు.

ఒకసారి సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చాక… కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. గతంలో కొన్నిసార్లు కేంద్రం జోక్యం చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అందుకు తగ్గట్టుగా చట్టాలు ఉండాలని సుప్రీం సూచించింది. దేశంలో రూపొందుతున్న సినిమాల్లో… దేశ వ్యతిరేక భావాలు ఉంటున్నాయని, విదేశాల్లో మన దేశ పరువు తీస్తున్నాయని కేంద్రం భావిస్తోంది. దీంతో కేంద్రం ఆ దిశగా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేపట్టింది. అయితే ఇది సినిమాలపై కేంద్రం పెత్తనమే అని సినిమా జనాలు అంటున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా, పక్క చిత్ర పరిశ్రమల వాళ్లు ఇంతగా వ్యతిరేకిస్తున్నా… మన టాలీవుడ్‌ స్టార్లు, రైటర్లు, దర్శకులు… అస్సలు ఎవరూ మాట్లాడటం లేదు. ఇప్పుడు కానీ మనం కామ్‌గా ఉంటే… రేపొద్దున మనమున్న గది కూడా కాలిపోతుందని అర్థం కావడం లేదా. సార్లూ… మీ కిందకు నీళ్లొస్తున్నాయ్‌… పూర్తిగా తడిసి, ముద్దయ్యాక అప్పుడు ఆలోచిస్తారా ఏంటి?

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus