సినిమాలకు వేణుమాధవ్ అందుకే దూరమయ్యారు

  • December 10, 2016 / 07:28 AM IST

వేదికలపై మిమిక్రీ తో నవ్వించి వెండి తెరలోకి ప్రవేశించిన హాస్యనటుడు వేణుమాధవ్. తనకంటూ ఓ శైలిని ఏర్పరుచుకుని 160  పైగా సినిమాల్లో నవ్వులు పూయించారు. నల్ల బాలు, దేత్తడి పోచమ్మ గుడి.. వంటి డైలాగులతో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ ఏడాదిలో వెండి తెరపైన వేణుమాధవ్ కనిపించలేదు. ఆయన నటించిన ఆఖరి చిత్రం రుద్రమ దేవి. దీంతో అతనికి ప్రాణాంతక వ్యాధి వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.  కొన్ని సైట్లు అయితే మరణించాయని కూడా కథనాలు రాశాయి. ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేణు మాధవ్ గవర్నర్‌ను, సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మీడియా కంటికి కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఓ వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను సినిమాలు చేయకపోవడానికి కారణం వివరించారు.

‘రచ్చ’ సినిమా షూటింగ్‌ జరిగే సమయంలో నేను మరో కొన్ని సినిమాలు కూడా ఒప్పుకున్నాను. రాత్రి భోజనం చేయకుండా ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లి పని పూర్తి చేశాను. తర్వాతి రోజు ఉదయం టిఫిన్‌ కూడా చేయకుండా ‘రచ్చ’ షూటింగ్‌లో పాల్గొన్నాను. దాంతో ఒళ్లంతా వణుకుపుట్టి, కళ్లు తిరిగి పడిపోయాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తరలించారు. జరిగింది అంతే. కానీ నాకు ఎన్నో రోగాలున్నాయని ప్రచారం చేశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాన’ని వేణుమాధవ్ స్పష్టం చేశారు. ఆ తర్వాత బూతు డైలాగ్‌లు ఉన్న కారణంగా కొన్ని సినిమాలను తాను పక్కనపెట్టానని, మరికొంత మంది తనను పక్కనపెట్టారని చెప్పాడు. అందుకే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కనిపించడం లేదని అన్నారు. పవన్‌ ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాలోనూ, తర్వాత చేయబోయే త్రివిక్రమ్‌ చిత్రంలోనూ తాను నటించనున్నట్లు వివరించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus