ఈ అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఇప్పటికే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇకపై థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవ్వవని కూడా కొందరు డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. కానీ.. నిర్మాతలు భారీ మొత్తానికి ఆశపడి అమేజాన్ ప్రైమ్ కు సినిమాలు అమ్మేస్తున్నారు. థియేటర్ల నుండి సినిమాను తీసేశాక సినిమాను ఆన్లైన్ లో రిలీజ్ చేయడం అనేది ఒకే కానీ.. థియేటర్లో విడుదలై కనీసం 30 రోజులు కూడా కాకుండానే ఆన్లైన్ లో విడుదల చేయడం అనేది ఎంతవరకూ సేఫ్ అనేది వాళ్ళకే తెలియాలి.
ఇకపోతే.. తమిళ లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ “విశ్వాసం” చిత్రాన్ని మార్చి 1న తెలుగులో అనువాదరూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అజిత్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రంలో సెంటిమెంట్ కి తమిళ ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడమే కాక నీరాజనాలు పలికారు. అందుకే ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ.. మార్చి 1న తెలుగులో విడుదలవ్వడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు.. అనగా ఫిబ్రవరి 25న అమేజాన్ ప్రైమ్ లో “విశ్వాసం” తమిళ వెర్షన్ ను విడుదల చేయనున్నారు. అమేజాన్ ప్రైమ్ అంటే ఎలాగూ సబ్ టైటిల్స్ ఉంటాయి. మరి అఫీషియల్ ప్రింట్ ఎలాగూ పైరసీ సైట్లలో వచ్చేస్తుంది కాబట్టి.. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసీ ఏం లాభం అని అడుగుతున్నారు జనాలు.