Pawan Kalyan: డిసెంబరు/ జనవరిలో ‘ఉస్తాద్‌’.. పవన్‌ ఆఖరి సినిమా ఇదేనా? మళ్లీ నటించడా?

చేతిలో ఉన్న మూడు సినిమాల తర్వాత పవన్‌ కల్యాణ్‌ మరో సినిమా చేస్తాడు, ఇంకొన్ని కథలు విన్నాడు, వింటున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2027లో ఓ సినిమా వచ్చేలా చూసుకుంటున్నాడని, అది రాజకీయాలకు కూడా పనికొచ్చేలా ఉంటుంది అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తర్వాత పవన్‌ మళ్లీ ముఖానికి రంగేసుకునేది కష్టమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీనికి కారణం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలే.

Pawan Kalyan

అవును, ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రచారంలో భాగంగా ఎప్పుడూ లేనిది పవన్‌ కల్యాణ్‌ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా గురించి, తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈ క్రమంలో ఇక సినిమాల్లో నటించేది డౌటే అనేలా మాట్లాడాడు. ‘అతిథి పాత్రల్లో కనిపిస్తా, సినిమాలు నిర్మిస్తా’ అని అన్నాడు కానీ.. ఎక్కడా సినిమాల్లో నటిస్తా అని మాత్రం చెప్పలేదు. దీంతో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఆఖరి సినిమా అవుతుంది అనే మాటలు బయటకు వచ్చాయి.

మామూలుగా అయితే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వచ్చే సమ్మర్‌లో వస్తుంది అని ఓ టాక్‌ వినిపించింది. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడే డేట్స్‌ ఇవ్వడంతో పూర్తవ్వడానికి సమయం పడుతుంది అని అనుకున్నారంతా. కానీ పవన్‌ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మరో వారంలో ఆయన షూటింగ్‌ పార్ట్‌ అయిపోతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది డిసెంబరులోనో లేక వచ్చే ఏడాది జనవరిలోనే సినిమాను రిలీజ్‌ చేస్తాం అని అంటున్నారు.

ఈ లెక్కన 2025లో పవన్‌ సినిమాలు మొత్తం మూడు వచ్చేస్తాయి. లేదంటే ఒక నెల ఎక్కువలో వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక పవన్‌ ఖాళీ. ఆ సమయాన్ని రాజకీయాల కోసం ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా పాలనా బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు జనసేనానిగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్ఠంగా సిద్ధం చేసుకోవాలి. అందుకే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చేస్తా అని అంటున్నారు. ఆ లెక్కన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పవన్‌ ఆఖరి సినిమా. మరో సినిమా వస్తుందనే పుకారు.. పుకారుగానే మిగిలిపోతుంది.

‘హరిహర వీరమల్లు’ కి 11 మైనస్ పాయింట్స్.. ఏంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus