ప్రొడక్షన్ లో చాలా ఆలస్యం జరిగి వాయిదా మీద వాయిదాలతో ఫైనల్ గా ఈ నెల 17న విడుదలవుతోంది ‘విరాటపర్వం’ సినిమా. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై హైప్ రాలేదనే మాట నిజం. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటికీ సోషల్ మీడియాలో కనిపించాల్సిన హడావిడి ఇంకా మొదలుకాలేదు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా.. బజ్ మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు.
పోస్టర్స్, లిరికల్ వీడియోలు అంటూ ప్రమోషన్స్ షురూ చేసినప్పటికీ.. చేతిలో మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఏ మేరకు జనాలకు ఈ సినిమా రీచ్ అవుతుందో చూడాలి. అసలే ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడిక్ సినిమా. జనాలకు ఈ మధ్య ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎక్కడం లేదు. ‘ఆచార్య’లో చిరంజీవి, చరణ్ లు కలిసి చేసిన నక్సలిజం ఎపిసోడ్ సినిమాకి పెద్ద మైనస్ అయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీస్తేనే సినిమా అలా ఉంది. కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమాలో ఇలాంటి ఎపిసోడే తేడా కొట్టింది.
కానీ ‘విరాటపర్వం’ అలా కాదు. థీమ్ కి కట్టుబడి నిజాయితీగా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఇంత సీరియస్ ఇంటెన్స్ డ్రామాని సామాన్య ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దర్శకుడు వేణు ఊడుగుల ఇది వరకు ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా మాత్రమే తీశారు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోయినా.. యూత్ కి కనెక్ట్ అయింది.
ఆ విధంగా చూసుకుంటే ‘విరాటపర్వం’ చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవడం ప్లస్ పాయింట్. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో తన లుక్, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. చాలా మంది హీరోలకు ఆమె లక్కీ మస్కట్. ఫ్లాప్స్ లో ఉన్నవారికి కూడా హిట్స్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో మరోసారి ఆమె అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.