ప్రపంచంలో సెంటిమెంట్లను పాటించేవారిలో సినిమా జనాలే ఎక్కువమంది అనొచ్చు. సినిమా లీకు నుండి రిలీజ్ వరకు అన్నీ సెంటిమెంట్లతోనే సాగుతాయి. ఈ క్రమంలో గతంలో ఏదో జరిగితే, తమ సినిమా దగ్గరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకూడదు అని కూడా అనుకుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలైన సీక్వెల్ సినిమాకు త్వరలో రాబోయే సీక్వెల్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ‘మూడు’ గండాన్ని ఆ సినిమా దాటుతుందా అంటూ లెక్కలేసుకుంటున్నారు.
టాలీవుడ్‌లో వచ్చిన కొత్త సినిమా, అందులో సీక్వెల్ సినిమా అంటే ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) అని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. సిద్ధ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) , అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మూడో పార్టు ఉంటుంది అని టీమ్ అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు సినిమా ఎండ్ టైటిల్స్ ఆ విషయం వేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండుసార్లు వచ్చి అలరించిన టిల్లు మూడోసారి కూడా అదే మ్యాజిక్ చేయగలుగుతాడా?
‘శుభం పలకరా అంటే… అదేదో పలికాడు అన్నట్లు’… అంటూ మా మీద ఏం అనుకోకండి. ఎందుకంటే గతంలో ఇలా వచ్చి ఇబ్బంది పడి, ఇబ్బంది పెట్టిన సినిమాల లిస్ట్ పట్టుకునే ఈ విషయం అంటున్నాం కాబట్టి. ఇప్పటిదాకా సౌత్ సినిమాలో సీక్వెల్స్ ఎక్కువగా రెండు పార్టులకే రిమితమయ్యాయి. ‘బాహుబలి’(Baahubali) , ‘కేజీయఫ్’ (KGF) రెండు భాగాలే వచ్చాయి. ‘పుష్ప’ (Pushpa) మూడో భాగం విషయంలో లీకులు వస్తున్నా సినిమా వస్తుందా అనేది డౌటే. ఇక హిందీలో ‘హౌస్ ఫుల్’ తప్ప ఇంకేవీ ఎక్కువ రాలేదు.
మూడో సీక్వెల్ వచ్చిన ‘గోల్ మాల్’, ‘టైగర్’, ‘ఫక్రే’, ‘సింగం’ (Singam) ఇలా చాలా సినిమాలు మూడో భాగం విషయంలో విజయం సాధించడంలో మొహమాటపడ్డాయి. దీంతో ఇప్పుడు కారణజన్ముడు ‘టిల్లు’ మూడోసారి వస్తే ఎలాంటి ఫలితం సాధిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్ట్ రెడీగా లేదని, కేవలం లైన్ మాత్రమే రెడీ ఉందని అంటున్నారు. మొత్తం రెడీ అయ్యి రిలీజ్ చేయాలంటే వచ్చే ఏడాదే.