వైఫ్ ఆఫ్ రామ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా – మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్

గాయకులు సంగీత దర్శకులు కావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ గాయకుడు సంగీత దర్శకుడిగా మారిన సినిమాలో అసలు పాటలే లేకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యం తనకూ కలిగిందని చెబుతున్నాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈచిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. కంప్లీట్ థ్రిల్లర్ గా వస్తోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు ఉండవు. కానీ నేపథ్య సంగీతం సగం కథను చెప్పాలి. అలాంటి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటోన్న రఘు ఈ సినిమాతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నాడు.

‘‘సింగర్ గా తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్‌, తమన్‌, హిప్‌ హాప్ తమిళ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఆరు పాటలు పాడాను.. ఇప్పటి వరకూ బాలీవుడ్ తో పాటు కన్నడ, మళయాల సినిమాలకు సంగీతం అందించాను. నా పాటలన్నీ మాగ్జిమం యూత్ ఫుల్ సాంగ్స్. అలాంటిది ఓ థ్రిల్లర్ సినిమాకు సంగీతం చేసే అవకాశం రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇందులో పాటలు ఉండవు అని దర్శకుడు విజయ్ ముందే చెప్పాడు. అందుకే ఈ అవకాశం ఛాలెజింగ్ గా అనిపించి చేస్తాను అని చెప్పాను. నిజానికి నాకు ఈ సినిమా దర్శకుడు విజయ్ ని పరిచయం చేసింది పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు టైమ్ లో సినిమా బావుందని మెసేజ్ చేశాను. తర్వాత ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వైఫ్ ఆఫ్ రామ్ దర్వకుడు విజయ్ ని పరిచయం చేసింది తరుణ్ భాస్కరే. వైఫ్ ఆఫ్ రామ్ వంటి సూపర్ థ్రిల్లర్ మూవీకి సంగీతం అందించడం నా అదృష్టంగా ఫీలవుతున్నాను.. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. సినిమాకు కథే హీరో. సంగీతానికి రెండో స్థానమే. సినిమా అద్భుతంగా ఉంది.

మంచు లక్ష్మి నటనకు ఫిదా అయిపోతారు. ఆమె నటన బ్యాక్ గ్రౌండ్ అందించే వారికే ఛాలెంజ్ విసిరనట్టుగా అనిపించింది. ఖచ్చితంగా ఇది తెలుగులో బెస్ట్ థ్రిల్లర్ అవుతుంది. నా వంతుగా నేను బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేశాను.
భాషా పరంగా ఇబ్బుందులు ఏమీ రాలేదు. నేటివిటీకి తగ్గట్టుగా సంగీతం వచ్చేందుకు దర్శకుడు విజయ్ చాలా హెల్ప్ చేశాడు. అతని సహకారంతనే బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వగలిగాను. ఇక నా వరకూ వస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని అనుకోలేదు. చాలాకాలం పాటు భరతనాట్యం నేర్చుకున్నా. సైంటిస్ట్ గానూ పనిచేశాను. బట్ విధి అంటారు కదా.. అదే నన్ను సంగీత దర్శకుడిగా మార్చింది. అందుకే ఇప్పుడు సంగీతమే నా లోకం అయింది. ఇక సింగర్ గా కంటే మ్యూజిక్ డైరెక్టర్ గానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను. అయినా వేరే వారి సంగీత దర్శకత్వంలో పాడేటప్పుడు సలహాలివ్వను. వారికేం కావాలో అదే పాడతాను. మొత్తంగా తెలుగు సినిమాలకు సంగీతం అందించాలన్న నా కల తీరింది. అది కూడా ఓ సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్ తో కావడం ఇంకా ఆనందంగా.. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే నా తెలుగు డెబ్యూ ఓ సూపర్ హిట్ తో ఉంటుందన్నమాట’’ అంటూ ముగించాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్.

ఇక ఈ నెల 20న విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus