కళ్యాణ్ రామ్ తో 118 వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు కె.వి.గుహన్. అప్పటి వరకు స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మాత్రమే పేరొందిన గుహన్ లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడు అని ఆ చిత్రంతో బయట పడింది. అతని దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం WWW. జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మొదటి చిత్రం అద్భుతం తో మంచి గుర్తింపు సంపాదించుకుంది శివాని.
పి ఎస్ వి గరుడ వేగ ఫేమ్ అదిత్ అరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. టీజర్ , ట్రైలర్ , పాటలకి మంచి స్పందన లభించడంతో సహజంగానే సినిమా పై అంచనాలు నమోదయ్యాయి. డిసెంబర్ 24న ఈరోజు సోని లివ్ ఓటిటి వేదికగా రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత వరకు మ్యాచ్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), క్రిష్టి(దివ్య శ్రీపాద) ఈ నలుగురు సాఫ్ట్ వేర్ టెకీలు. వీళ్ళు వర్చువల్ మీట్ లలో మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ పనిచేసుకుంటూ ఉంటారు. క్రిష్టి రూమ్ కి మిత్ర(శివాని రాజశేఖర్) ఫ్రెండ్ వస్తుంది. క్రిష్టి ద్వారా విశ్వ …మిత్రకి పరిచయమవుతాడు. మిత్ర ఫ్యామిలీకి.. విశ్వ హెల్ప్ చేయడం తో వారి పరిచయం ప్రేమగా మారుతుంది. వీళ్ళిద్దరూ కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్న టైం కి కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడుతుంది. దాంతో వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
అయినప్పటికీ ఆన్ లైన్లో వాళ్ళ ప్రేమని కొనసాగిస్తారు. కానీ ఓ రోజు ఊహించని విధంగా ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) .. క్రిష్టి ఫ్లాట్ లోకి వచ్చి ఆమెను కత్తితో పొడిచేస్తాడు. తర్వాత మిత్రని కూడా దారుణంగా వేధిస్తూ విశ్వ పై పగ సాధిస్తూ ఉంటాడు. చివరికి క్రిష్టీ బ్రతికిందా..అసలు వీళ్ళ పై ఎటాక్ చేసిన వ్యక్తి ఎవరు? అసలు అతనికి విశ్వ అండ్ ఫ్రెండ్స్ కి సంబంధం ఏంటి? అన్నది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : హీరో అదిత్ అరుణ్… మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.కొన్ని సార్లు ఓవర్ చేసినట్టు అనిపించినా.. కన్వెన్సింగ్ గా ఫీలయ్యేలా చేశాడు. శివాని రాజశేఖర్ అద్భుతం సినిమాలో కంటే బాగా చేసింది కానీ లుక్స్ పరంగా ఆమె ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు కానీ ఎక్కువ వారికి స్క్రీన్ స్పేస్ లేదు.అయితే కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ మాత్రం బాగా పెర్ఫార్మ్ చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా ఈ చిత్రంలో నటించాడు అనే కంటే అతిథి పాత్ర పోషించాడు అని చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు : గుహన్ దర్శకుడిగా మరో సారి తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫి కూడా బాగానే అనిపిస్తుంది.కాకపోతే సినిమాని రెండు మూడు పాత్రలకే పరిమితం చేయడం అతను చేసిన పెద్ద మిస్టేక్. హీరో,హీరోయిన్,విలన్ లని తప్ప మిగిలిన నటుల్ని అతను పెద్దగా వాడుకోలేదు. సైమన్ కె. కింగ్ సంగీతం బాగుంది. రెండు పాటలు సినిమాకి ముందే హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతంతో కూడా అతను హైలెట్ అవ్వాలని ప్రయత్నించాడు. కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అలా అని తీసిపారేసేలా కూడా లేదు లెండి. సన్నివేశాల మూడ్ కు తగినట్టు లేదు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువలకు కూడా మంచి మార్కులే వేయొచ్చు.
విశ్లేషణ : కథ ఏమీ లేకపోయినా ఒక చిన్న పాయింట్ ను దర్శకుడు డీల్ చేసిన విధానానికి మంచి మార్కులు వెయ్యాలి. తక్కువ రన్ టైం.. రెండు పాటలు, శివాని నటన, గుహన్ టేకింగ్ కోసం ఒకసారి హ్యాపీగా ఈ చిత్రాన్ని చుసేయ్యొచ్చు. ఓటిటిలో రిలీజ్ చేయడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.