చోకడీ గ్యాంగ్ అనే నలుగురు నేరగాళ్ల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యారా”. తనదైన శైలి సినిమాలతో అలరించే తిగ్మన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విద్యుత్ జమ్వాల్-శ్రుతి హాసన్ జంటగా నటించారు. జీ5 యాప్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!
కథ: ఫగుణ్ (విద్యుత్ జమ్వాల్), మిత్వా (అమిత్ సాద్) అండ్ గ్యాంగ్ ఇండియా-నేపాల్ బోర్డర్ లో స్మగ్లింగ్ చేస్తూ ఎదుగుతారు. ఆ తర్వాత ఒక ముఠాగా ఏర్పడి గన్నులు సప్లై చేయడం మొదలెడతారు. ఒక ఫారెస్ట్ రైడ్ లో దొరికిపోయి.. కొన్నాళ్లపాటు జైలు శిక్ష అనుభవించి తర్వాత బయటకు వచ్చి గోల్డ్ స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోతారు. అంతా సవ్యంగా ఉంది అనుకున్న తరుణంలో మిత్వాను పోలీసులు ఒక హైప్రొఫైల్ కేస్ లో అరెస్ట్ చేస్తారు.
ఆ కేసు నుండి మిత్వాను బయటపడేసే సమయంలో ఫగుణ్ & గ్యాంగ్ కు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటవి? చివరికి చోకడి గ్యాంగ్ పరిస్థితి ఏమైంది? అనేది “యారా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: తెలుగు ప్రేక్షకులకు విలన్ గా సుపరిచితుడైన విద్యుత్ జమ్వాల్ ఈ చిత్రంలో తన రెగ్యులర్ బాడీ బిల్డర్ హీరోలా కాకుండా ఒక కమర్షియల్ హీరోగా అలరించాడు. అయితే.. అతని లుక్స్ సినిమాలోని పాత్రకు సూట్ అవ్వకపోవడమే మైనస్.
అమిత్ సాద్, విజయ్ వర్మ, శ్రుతిహాసన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాన్నాళ్లుగా శ్రుతిహాసన్ గ్లామర్ ను మిస్ అవుతున్న ఆమె అభిమానులకు ఈ చిత్రం ఆ కొరత తీర్చింది. శ్రుతి ఈ చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తుంది. ఆమె పాత్ర కథలో కీలకమైనది కావడం గమనార్హం.
సాంకేతికవర్గం పనితీరు: సిద్ధార్ధ్ పండిట్ సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగులో “సరైనోడు” చిత్రానికి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ కూడా ఈయనే. ఇక రా & కల్ట్ ఫిలిమ్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన నటుడు, రచయిత, దర్శకుడు తిగ్మన్షు ధూలియా “యారా” చిత్ర నేపధ్యంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. అతని ఫార్మాట్ సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ చిత్రం కూడా నచ్చుతుంది. కానీ.. కథ-కథనంలో కొత్తదనం అనేది కొరవడింది. స్క్రీన్ ప్లే మరియు కొన్ని సన్నివేశాల డీటెయిలింగ్ మినహా పెద్దగా ఆకట్టుకొనే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్.
విశ్లేషణ: తిగ్మన్షు ధూలియా పనితనం మెచ్చినవారికి, శ్రుతిహాసన్ కోసం చూసేవారికి ఈ సినిమా ఓ మేరకు నచ్చుతుంది. “యారా” రెట్రో స్టైల్లో సాగే ఒక యాక్షన్ డ్రామా. కాకపోతే విద్యుత్ ఉన్నాడు కాబట్టి కాస్త ఎక్కువ యాక్షన్ ను ఎక్స్ పెక్ట్ చేసి సినిమా చూస్తే మాత్రం తప్పకుండా నిరాశ చెందుతామ్.
రేటింగ్: 2/5
ప్లాట్ ఫార్మ్: జీ5