‘మహానటి’ తో మొదలైన బయోపిక్స్ ట్రెండ్ ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది అనే చెప్పాలి. నిజానికి ‘మహానటి’ టైంలో రూపొందిన బియోపిక్స్ ఏవి కూడా సక్సెస్ సాధించింది లేదు. కానీ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన ‘యాత్ర’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. 2019 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో జగన్ ప్రభుత్వానికి మంచి మైలేజి చేకూరింది. నిజానికి ఈ చిత్రంలో వై.ఎస్.జగన్ ప్రస్తావన ఏమీ ఉండదు.
అలా అని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని కూడా ఎక్కువ శాతం చూపించలేదు. 2004 ఎన్నికలకు ముందు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి, అది అతను ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంత ప్లస్ అయ్యింది అనే అంశాన్ని మాత్రమే దర్శకుడు మహి.వి.రాఘవ్ టచ్ చేశాడు. ఎటువంటి కాంట్రవర్సీలకు స్కోప్ ఇవ్వకుండా చాలా బాలన్స్డ్ గా సినిమాని తీర్చిదిద్దాడు. అలాగే ‘యాత్ర 2’ కూడా ఉంటుంది అని అతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ‘యాత్ర 2’ మొత్తం వై.ఎస్.జగన్ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన అంశాలను తీసుకుని ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దాలి అనేది మహి.వి.రాఘవ్ ప్రధాన ఉద్దేశం. జగన్ పాత్ర కోసం అతను హీరోల వేట కూడా మొదలుపెట్టాడు. సూర్య, కార్తిలతో సంప్రదింపులు జరిపాడు. వాళ్ళు బిజీగా ఉండడంతో ఆది పినిశెట్టిని కూడా సంప్రదించాడు.
ఈ పాత్ర చేయడానికి ఆది రెడీగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఎందుకంటే అతని ఇమేజ్ ను పెంచే అంశాలు ఇందులో ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినట్టు వినికిడి. మరెందుకు ఆలస్యం అవుతుంది అంటే.. బడ్జెట్ వ్యవహారం అని వినికిడి. ఈ మూవీకి ‘యాత్ర’ కంటే డబుల్ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందట. ఈ లెక్కలు అన్నీ తేలాకే ‘యాత్ర 2’ పట్టాలెక్కుతుంది అని సమాచారం.