Yatra2 Review in Telugu: యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 8, 2024 / 01:39 PM IST

Cast & Crew

  • జీవా (Hero)
  • కేతకీ నారాయణ్ (Heroine)
  • మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్, శుభలేఖ సుధాకర్ తదితరులు.. (Cast)
  • మహి వి.రాఘవ్ (Director)
  • శివ మేక - మహి వి.రాఘవ్ (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • మధి (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 08, 2024

అసలు బయోపిక్ లు అంటే బోర్ కొట్టేసిన తరుణంలో, ఎవర్నీ టార్గెట్ చేయకుండా, ఒకర్ని తక్కువ చేసి చూపించకుండా.. పోలిటికల్ బయోపిక్ లు ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు మహి వి.రాఘవ్. “యాత్ర” చాలా చక్కగా తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్న మహి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని “యాత్ర”కి సీక్వెల్ గా “యాత్ర 2” తెరకెక్కించాడు. మరి ఈ సీక్వెల్ తో మహి మంచి హిట్ కొట్టాడా లేదా అనేది చూడాలి.

కథ: రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) హఠాన్మరణం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతాయి. అధికార పార్టీ మొదలుకొని ప్రతిపక్షం వరకూ అందరూ అధికారం కోసం విశ్వప్రయత్నాలు మొదలెడతారు. అలాంటి తరుణంలో పద్మవ్యూహంలోకి అడుగుపెడతాడు జగన్ మోహన్ రెడ్డి (జీవా). రాజకీయ భీష్ముల్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. ఈ రాజకీయ రణరంగంలో జగన్ ఎదురుకొన్న ఇబ్బందులేమిటి? అతడికి అండగా ఎవరు నిలిచారు? అనేది “యాత్ర 2” చూసి తెలుసుకోవాల్సిన విషయం.


నటీనటుల పనితీరు: “యాత్ర”లో రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి ఎక్కడా ఇమిటేషన్ చేయకుండా.. పాత్ర స్వభావాన్ని తెరపై అద్భుతంగా పండించిన తీరు ఎవరూ మర్చిపోలేరు. “యాత్ర 2″లో ఉన్న కొద్దిసేపు కూడా అదే తరహాలో ఆయన తన సీనియారిటీతో పాత్రను ఎలివేట్ చేశాడు. ఇక జగన్ గా జీవా జీవించేశాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని మ్యానరిజమ్స్ వరకూ ప్రతి విషయంలో తెరపై జగన్ కనిపించేలా చేశాడు.

అయితే కొన్నిచోట్ల మాత్రం ఇమిటేషన్ చేసినట్లుగా ఉంటుంది. వై.ఎస్.విజయమ్మగా ఆశ్రిత వేముగంటి ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా అలరించింది. ఆమె చెప్పే డైలాగులు, హావభావాలు కన్నీటు పెట్టిస్తాయి. వై.ఎస్.భారతిగా కేతకి నారాయణ్ & చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ లు పర్వాలేదనిపించుకున్నారు. నటిగా మెప్పించలేకపోయినా.. అచ్చుగుద్దినట్లు సోనియా గాంధీలా కనిపించి ఆశ్చర్యపరిచింది సుజానే బెర్నెట్.


సాంకేతికవర్గం పనితీరు: సంతోష్ నారాయణ్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఎమోషనల్ సీన్స్ & ఎలివేషన్స్ కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. బాణీలు & సాహిత్యం కూడా బాగున్నాయి.
మధి సినిమాటోగ్రఫీ వర్క్ ఆసక్తికరంగా ఉంది. కలర్ గ్రేడింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. దర్శకుడు మహి వి.రాఘవ్ మరోమారు తన మార్క్ ను చాటుకున్నాడు. జగన్ బయోపిక్ అనేసరికి టి.డి.పి & జనసేన పార్టీల మీద లేనిపోని నెగిటివిటీ ఉంటుంది అనుకున్న వాళ్లందరి అంచనాలను తలకిందులు చేశాడు.

ఒకానొక సందర్భంలో చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అని ఎలివేట్ చేసిన విధానం యాంటీ ఫ్యాన్స్ ను కూడా మెప్పిస్తుంది. అలాగే.. ఒకర్ని కించపరచకుండా పోలిటికల్ డ్రామా తెరకెక్కించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. ఫస్టాఫ్ వరకూ చాలా హుందాగా సాగినప్పటికీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం చిన్నపాటి ప్రోపగాండా మొదలవుతుంది. “యాత్ర” పార్ట్ 1 లో ఉన్న ఖచ్చితత్వం రెండో భాగమైన “యాత్ర 2″లో లోపించింది.

జగన్ వ్యక్తిత్వాన్ని మేరు పర్వతమంత గొప్పదంటూ ప్రొజెక్ట్ చేయడం కోసం పరితపించిన విధానం కారణంగా సెకండాఫ్ గాడి తప్పింది. అందువల్ల సెకండాఫ్ లో ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. కాకపోతే.. సరిగ్గా జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో సినిమాని ముగించి.. ఆ తర్వాత జరిగిన రచ్చల జోలికి వెళ్లకపోవడం దర్శకుడిగా, రచయితగా అతడు చేసిన తెలివైన పని.

విశ్లేషణ: జగన్ అభిమానులకు మాత్రమే నచ్చే చిత్రమిది. అలాగే.. రాజకీయ సమీకరణలు అర్థం కాని, అవగాహన లేని ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. కాకపోతే.. పూర్తిస్థాయి పోలిటికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం పొంతన లేని విషయాలు జీర్ణించుకోవడం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus