విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రమైన “ఏ మంత్రం వేసావె” దాదాపు అయిదేళ్ళ తర్వాత దుమ్ము దులుపుకొని ఇవాళ విడుదలైంది. “పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి” చిత్రాలతో విజయ్ దేవరకొండ సంపాదించుకొన్న క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేశారు. మరి ఈ డెబ్యూ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!
కథ : నిక్కీ (విజయ్ దేవరకొండ) ఒక గేమర్. గేమ్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మాత్రమే కాదు బయట ప్రపంచంతో సైతం సంబంధం లేకుండా రోజుల తరబడి గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఆ విధంగా వర్చువల్ వరల్డ్ కి ఎడిక్ట్ అయిపోయిన నిక్కీ ఆన్ లైన్ లో పరిచయమైన రాగ్స్ (శివానీ సింగ్) అనే అమ్మాయి కారణంగా ప్రపంచాన్ని చూడడం మొదలుపెడతాడు.
అయితే.. రాగ్స్ కోసం వెతికే సమయంలో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు నిక్కీ. ఆ సమస్యల నుంచి నిక్కీ ఎలా బయటపడ్డాడు? ఇంతకీ నిక్కీని రోడ్డు మీద పరిగెట్టించిన రాగ్స్ గోల్ ఏంటి అనేది “ఏ మంత్రం వేసావే” కథాంశం.
నటీనటుల పనితీరు : హీరోగా విజయ్ దేవరకొండ పరిచయ చిత్రం అవ్వడం వలన “ఏ మంత్రం వేసావే”లో మనోడి పెర్ఫార్మెన్స్ ని చూసి ఇప్పుడు జస్టిఫై చేయడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ చూడ్డానికి చిరాగ్గా ఉన్నాయి. అసలు సన్నివేశానికి సంబంధం లేకుండా దేవరకొండ పలికించే హావభావాలు చూడ్డానికి కూడా ఇబ్బందిపడాలి.
హీరోయిన్ గా నటించిన శివానీ సింగ్ గ్లామర్ డాల్ తరహాలో సినిమాకి గ్లామర్ అద్దడానికి తప్పితే ఎందుకూ ఉపయోగపడలేదు. పైగా బ్లాంక్ ఫేస్ పెట్టిన ఆ అమ్మడిని తెరపై చూడ్డానికి కూడా ఓపిక కావాలి. ఇక మిగతా ముఖ్యపాత్రలు పోషించిన నటీనటులకు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ పోషించారనే విషయంలో క్లారిటీ వారికైనా ఉందో లేదో వాళ్ళకే తెలియాలి.
సాంకేతికవర్గం పనితీరు : అబ్బత్ సమత్ సంగీతం గురించి, శివారెడ్డి సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. ఈ ఇద్దరి పనితనం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారిందే తప్ప సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక దర్శకుడు చెప్పాలనుకొన్నదానికి, సినిమాలో చూపించినదానికి ఏమాత్రం సంబంధం లేదు. పైగా.. అనవసరంగా అల్లిన సన్నివేశాలు ఎందుకు అనేది దర్శకుడి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు ఇన్నేళ్ల తర్వాత ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని ఎందుకని సడన్ గా రిలీజ్ చేయాలనుకొన్నారో దర్శకనిర్మాతలకే తెలియాలి. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండకి మైనస్ అవుతుందే తప్ప ప్రేక్షకులకి గానీ దర్శకనిర్మాతలకు కానీ ఏమాత్రం ఉపయోగపడదు. కావున విజయ్ దేవరకొండ వీరాభిమానులు మాత్రమే కాదు సగటు సినిమా అభిమానులకు కూడా ఏమాత్రం ఉపయోగపడదు.
విశ్లేషణ : విజయ్ దేవరకొండే స్వయంగా “ఇది నా బ్యాక్ లాగ్, అనగా ఫెయిల్ అయిన సబ్జెక్ట్” అని తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసిన “ఏ మంత్రం వేసావే” చిత్రాన్ని చూడకుండా ఉండడం ఉత్తమమైన పని.
రేటింగ్: 1/5