పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమ రాయుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన “వీరమ్” సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో శర్వానంద్, నవీన్ చంద్ర, విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురు యువ హీరోల పాత్ర గురించి తెలిసింది. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్లుగా వారు కనిపించనున్నారని సమాచారం.
తమిళ వెర్షన్లో అజిత్ కి నలుగురు తమ్ముళ్లు ఉంటారు. తెలుగు వెర్షన్లోకి ఆ సంఖ్యను ముగ్గురికి పరిమితం చేశారు. సికింద్రాబాద్ లో నిన్నటి నుంచి మొదలైన షెడ్యూల్ లో జూనియర్ ఆర్టిస్టులపై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రీకరణలో పవర్ స్టార్ శనివారం నుంచి జాయిన్ అవుతారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఇందులో పవన్ సరసన ఇద్దరు కథానాయకులు నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపిక కాగా, రెండో హీరోయిన్ గా కీచక, టైటానిక్ ఫేమ్ యామిని భాస్కర్ ఖరారు అయింది. ఈ మూవీ ప్రారంభానికి చాలా ఆలస్యం కావడంతో సాధ్యమైనంత వేగంగా సినిమాను పూర్తి చేయాలనీ చిత్ర బృందం శ్రమిస్తోంది.