Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కారణంగా చాలామంది లాభపడుతున్నారు. అలాగే కొంతమంది తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారిలో ఎక్కువమంది సెలబ్రిటీలే ఉన్నారు. వారిలో స్టార్‌ కపుల్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ కూడా ఉన్నారు. ఏఐ వీడియోలపై ఇటీవల ఈ జోడీ కోర్టును ఆశ్రయించింది. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ కంటెంట్‌ను మీ ప్లాట్‌ఫామ్‌ నుండి తొలగించండి అంటూ యూట్యూబ్‌పై రూ.4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తాజాగా దీనిపై యూట్యూబ్‌ దిగొచ్చినట్లు సమాచారం.

Aishwarya Rai & Abhishek Bachchan

ఈ మేరకు అభిషేక్‌ – ఐశ్వర్య అంటూ రూపొందిన ఏఐ ఫొటోలు, వీడియోలను, మార్ఫింగ్‌ కంటెంట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అభిషేక్‌ – ఐశ్వరపై యూట్యూబ్‌లో 250కిపైగా వీడియోలు ఉన్నాయని.. వాటికి 1.6 కోట్ల వ్యూస్‌ వచ్చాయని ఓ అంచనాకు వచ్చారు. వాటన్నింటిని ఇప్పుడు తొలగించారని తెలుస్తోంది. మరోమారు పరిశీలించి ఇంకా ఏమన్నా ఇలాంటి కంటెంట్‌ ఉంటే పూర్తిగా తొలగించే పనుల్లో యూట్యూబ్‌ ఉందని సమాచారం.

ఇంతకీ ఏమైందంటే? అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడుతున్నారంటూ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ కొన్ని రోజుల క్రితం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు అభిషేక్‌ – ఐశ్వరకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐశ్వర్య ఫొటోల దుర్వినియోగం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా… ఆమె గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీంటున్నాయని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని కూడా స్పందించింది.

వెంటనే వీడియోలను తొలగించాలని.. గూగుల్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు అందిన 72 గంటల్లోపు పిటిషన్‌లో ఐశ్వర్య, అభిషేక్‌ ఇచ్చిన వీడియోలను బ్లాక్‌ చేయాలని తీర్పులో న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. అయితే ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ఆ వీడియోలు ఉండటంతో యూట్యూబ్‌ మీద పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో ఆ వీడియోలను సంస్థ తొలగించింది. ఇలా మిగిలిన సెలబ్రిటీలు కూడా చేస్తే.. ఫేక్‌ కంటెంట్‌ సమస్య చాలా వరకు తప్పుతుంది.

 ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus