చిత్ర పరిశ్రమలో స్థిరపడిన ఎన్నారైలు

బస్ కండక్టర్ నుంచి డాక్టర్ వరకు .. అందరినీ ఆకర్షించే శక్తి సినిమా రంగానికి ఉంది. ఆదరించే సహనం ఉంది. ప్రతిభ ఉంటే ప్రోత్సహించే మనసు ఉంది. అందుకే ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్లినా.. సినిమాపై ఇష్టంతో ఇండియాకి వచ్చి కొంతమంది కష్టపడ్డారు. డైరక్టర్స్ గా మంచి చిత్రాలను తీసి సక్సస్ అయ్యారు. అలా సినీలోకానికి వచ్చిన ఎన్నారైలపై ఫోకస్…

గోవర్ధన్ గజ్జల 2004 సంవత్సరం లో గోవర్ధన్ గజ్జల అమెరికా వెళ్లారు. అక్కడే మాస్టర్స్ చదివారు. తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సినిమాపై మక్కువతో అక్కడే డైరక్షన్లో కోర్స్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. ఇక ఇండియాకి వచ్చి “ప్రేమ ఎంత కఠినం ప్రియురాలు అంత కఠినం” అనే సినిమాని అతి తక్కువ ఖర్చుతో తీసి అభినందనలు అందుకున్నారు.

ప్రవీణ్ సత్తారు చందమామకథలు .. అనే సినిమా టైటిల్ వినగానే దీన్ని ఎవరో అచ్చతెలుగు యువకుడు డైరక్ట్ చేసారని అంటారు. తీసింది వైజాక్ కి చెందిన కుర్రోడే, కానీ ఇతను విదేశాల్లో శాప్ కన్సల్ట్రన్ట్ గా ఓ బడా కంపెనీలో పదేళ్ళపాటు పనిచేశారు. ఇష్టంతో సినీరంగంలో తేలారు. అతనే ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగా సినిమాల్తో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు.

శేఖర్ కమ్ముల సినీ పరిశ్రమలో ఎన్నారై అని చెప్పగానే ఎక్కువమంది గుర్తుకు వచ్చేపేరు శేఖర్ కమ్ముల. న్యూ జెర్సీలో ఐటీ కెరీర్ ని వదులుకుని సినిమాల బాట పట్టారు. డాలర్ డ్రీమ్స్ తో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ఆనంద్ చిత్రం ద్వారా మంచి పేరు దక్కించుకున్నారు. రీసెంట్ గా ఆయన తీసిన ఫిదా కలక్షన్ల వర్షం కురిపించింది.

దేవా కట్ట రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వెన్నెల, ప్రస్థానం వంటి గొప్ప చిత్రాన్ని తీసిన దేవా కట్ట అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నారు. ఇతను పుట్టింది కడప అయినప్పటికీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సినిమా అనే పురుగు బుర్రలో తొలచడంతో ఫిల్మ్ నగర్ కి వచ్చారు.

శ్రీనివాస్ అవసరాల మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అవసరాల. ఇది అతని హోదా. ఉన్నత విద్యను నార్త్ డకోటా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అమెరికాలోని పెద్ద కంపెనీలో కొన్నేళ్లు పనిచేశారు. ఇవి ఏమి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. చిత్ర పరిశ్రమలోని 24 ఎందులోనైనా పట్టు సాధించాలని వచ్చారు. నటుడిగా రాణిస్తూనే ఊహలు గుసగుసలాడే చిత్రంతో డైరక్టర్ గా హిట్ కొట్టారు.

వెన్నెల కిషోర్ వెన్నెల సినిమా ద్వారా హాస్యనటుడిగా గుర్తిమ్పు తెచ్చుకున్న కిషోర్ స్వస్థలం కామారెడ్డి (నిజామాబాద్). అతను స్టడీ అనంతరం అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ క్వాలిటీ ఇంజినీర్ గా పనిచేశారు. ఆ ఫీల్డ్ సంతృప్తి ఇవ్వకపోవడంతో మనసు లాగుతున్న సినిమాల వైపే వచ్చేసారు. విదేశాల్లోనే స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసిన వెన్నెల కిషోర్ డైరక్టర్ గా వెన్నెల 1 ½, జఫ్ఫా చిత్రాలను తెరకెక్కించారు.

క్రిష్ అద్భుత కథ చిత్రాలను తీసిన క్రిష్ చదువుకొవడానికి న్యూ జెర్సీ కి వెళ్లారు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మిత్రుడు, ప్రస్తుత నిర్మాత రాజీవ్ రెడ్డి కలిసి కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. సినిమా గురించి ఆలోచనలు రావడంతో ఇండియాకి వచ్చి గమ్యాన్ని చేరుకున్నారు. తెలుగులో గమ్యం, వేదం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి మంచి చిత్రాలను రూపొందించారు.

రవి బాబు ప్రముఖ నటుడు చలపతి రావు తనయుడు రవి బాబు ఎంబీఏ చదివిన తర్వాత యాడ్స్ రంగంలో పనిచేశారు. అప్పుడే సోనీ కంపెనీ అతని ప్రతిభని మెచ్చి కాలిఫోర్నియాలో సినిమాటోగ్రఫీ లో శిక్షణ ఇచ్చింది. అక్కడే అనేక ఉద్యోగాలు వచ్చినప్పటికీ అన్ని వదిలి ఇండియాకి వచ్చి అల్లరి సినిమాతో డైరక్టర్ గా అవతారమెత్తారు. అనేక వినూత్నమైన సినిమాలు తెరకెక్కించారు.

అడివి శేష్ తెలుగు పరిశ్రమల్లోని మల్టీ ట్యాలంటెడ్ యువకుల్లో అడివి శేష్ ఒకరు. హీరో, విలను పాత్రలలో మెప్పించే శేష్ కి రచన, స్క్రిప్ట్, డైరక్షన్ విభాగాల్లో మంచి పట్టుఉంది. ఇతను పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ పెరిగింది, చదువుకుంది మొత్తం అమెరికాలోనే. సినిమాపై ప్యాషన్ తో ఇక్కడకు వచ్చారు. “ఖర్మ” చిత్రంతో డైరక్టర్ గాను ప్రతిభను నిరూపించుకున్నారు.

రాజ్ పిప్పళ్ల భీమవరానికి చెందిన రాజ్ పిప్పళ్ల కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ పూర్తిచేసి అమెరికాలో మంచి జాబ్ లో చేరారు. కొన్నేళ్లపాటు బాగా పనిచేశారు. చివరికి బోణీ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus