సినిమా అనేది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్. దర్శకుడికి అవకాశం. కానీ నిర్మాతకి ఇదొక రిస్కీ బిజినెస్. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అప్పుడే అందరికీ మనుగడ. ఒక్కోసారి హీరోల ఇమేజ్ లేదా మార్కెట్ తగ్గినప్పుడు నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకు రారు. ఇలాంటి టైంలో కొంతమంది హీరోలు రూటు మార్చి విలన్ లేదా సపోర్టింగ్ రోల్స్ చేసేస్తారు. కానీ కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారి పెద్ద రిస్క్ చేశారు. సక్సెస్ అయ్యి మార్కెట్ కూడా పెంచుకున్నారు. అలాంటి హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ 1985 లో ‘కృష్ణ గారడి’ ‘బ్రహ్మాస్త్రం’ వంటి సినిమాలు చేశారు. అవి 2 ఫ్లాప్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపలేకపోయాయి. వీటికి ముందు వచ్చిన ‘మహా మనిషి’ కూడా ప్లాప్ అయ్యింది.దీంతో కృష్ణ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. అలాంటి టైంలో ‘సింహాసనం’ అనే సినిమా చేశారు కృష్ణ. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ఇదే. కృష్ణ తన వద్ద ఉన్నదంతా పెట్టేసి తీశారు. తేడా వస్తే ఫ్యామిలీ రోడ్డున పడే పరిస్థితి. అయితే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
2) మోహన్ బాబు:
సొంత నిర్మాణ సంస్థ స్థాపించి మోహన్ బాబు ఎన్నో హిట్లు అందుకున్నారు. అయితే ఒకానొక టైంలో తీసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి టైంలో రజినీకాంత్ సూచన మేరకు ఆస్తులు తాకట్టు పెట్టి ‘పెదరాయుడు’ చేశారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. హీరోగా, నిర్మాతగా కూడా మోహన్ బాబు రేంజ్ మరింతగా పెరిగింది.
3) నితిన్:
‘సై’ తర్వాత నితిన్ కి 12 ప్లాపులు పడ్డాయి. ఇక హీరోగా నితిన్ నిలబడటం కష్టమే అని అంతా అనుకున్నారు. పెద్ద డైరెక్టర్లు కూడా అతనికి మొహం చాటేస్తున్న రోజులవి. అలాంటి టైంలో సొంత నిర్మాణంలో ‘ఇష్క్’ చేశారు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చేశారు అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది.
4) కమల్ హాసన్:
కమల్ హాసన్ వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో.. తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ సొంత బ్యానర్ పై ‘విశ్వరూపం’ నిర్మించారు. రిలీజ్ కి ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ సినిమా.. ఫైనల్ గా అన్ని అడ్డంకులు తొలగించుకుని రిలీజ్ అయ్యింది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
5) మహేష్ బాబు:
‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మహేష్ బాబు మార్కెట్ కొంచెం డౌన్ అయ్యింది. అలాంటి టైంలో నిర్మాతగా మారి ‘శ్రీమంతుడు’ చేశాడు మహేష్ బాబు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి ప్రయాణం ఈ సినిమాతో మొదలైంది. కొరటాల శివ కూడా ఒక సినిమా దర్శకుడే. దీంతో మహేష్ బాబు బ్రాండ్ పై దీనికి బిజినెస్ జరిగింది. తర్వాత సినిమా సూపర్ హిట్ అయ్యింది. మహేష్ మార్కెట్ కూడా మెరుగుపడింది.
6) సందీప్ కిషన్:
యంగ్ హీరో సందీప్ కిషన్ ని సైతం ఓ దశలో ప్లాపులు వెంటాడాయి. అలాంటి టైంలో నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. సందీప్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు.
7) కళ్యాణ్ రామ్:
నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్టార్ కాలేకపోయాడు కళ్యాణ్ రామ్. అయితే సొంత నిర్మాణంలో సినిమాలు చేసి హిట్లు కొట్టి.. కొందరు స్టార్ డైరెక్టర్స్ ని టాలీవుడ్ కి అందించారు. అయితే రూ.25 కోట్లు మార్కెట్ కూడా లేని కళ్యాణ్ రామ్.. సొంత బ్యానర్ పై రూ.40 కోట్లు పెట్టి ‘బింబిసార’ ని నిర్మించారు.దీనికి ముందు అతను చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇది సూపర్ హిట్ అయ్యింది. భారీ లాభాలు తెచ్చి పెట్టడమే కాకుండా కళ్యాణ్ రామ్ మార్కెట్ కూడా పెంచింది.
8) విశ్వక్ సేన్:
చెప్పుకోడానికి ప్రతి సినిమాకి మంచి టాక్ వస్తున్నా… విశ్వక్ సేన్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండేది. అలాంటి టైంలో ఉన్నదంతా పెట్టి ‘దాస్ క ధమ్కీ’ అనే సినిమా చేశాడు. ఇది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. విశ్వక్ సేన్ మార్కెట్ పెంచింది.
9) కిరణ్ అబ్బవరం:
అప్పటివరకు పలు హిట్లు కలిగి ఉన్నప్పటికీ.. ఓటీటీ హీరోగానే కిరణ్ సెటిల్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. మధ్యలో ‘మీటర్’ ‘రూల్స్ రంజన్’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలాంటి టైంలో సొంత నిర్మాణంలో ‘క’ అనే సినిమా చేశాడు. ఇది మంచి విజయం అందుకుంది. కిరణ్ మార్కెట్ ను కూడా పెంచింది.
10) మంచు విష్ణు:
‘ఢీ’ ‘దేనికైనా రెడీ’ ‘దూసుకెళ్తా’ ‘ఈడోరకం ఆడోరకం’ వంటి హిట్లు ఉన్నప్పటికీ మంచు విష్ణుకి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ చేశాడు. ఇది మంచి టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ వంటి స్టార్స్ ఉండటంతో ఈ సినిమాకి రికవరీ బాగానే జరిగినట్టు వినికిడి. అలాగే మంచు విష్ణుపై బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు నిర్మాతలు.