‘ఆర్ఆర్ఆర్’తో మాంచి జోరు మీదున్న సినిమా ఇండస్ట్రీలో ఈ వారం కూడా వరుస సినిమాలు రానున్నాయి. అయితే వాటిలో చాలావరకు చిన్న సినిమాలే. అయితే వేటికవే భిన్నమైన కథ, కథనాలతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అలా ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు, వాటి సంగతులు చూద్దాం. అలాగే వెబ్ సిరీస్‌ల ముచ్చట్లు కూడా మీ కోసం.
తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంత విరామం తర్వాత తాప్సి పన్ను తెలుగు సినిమా చిత్రమిది. ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు.
జాన్ అబ్రహమ్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ సినిమా ‘ఎటాక్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది.
ఏప్రిల్ 1న తెలుగు, బంజారా భాషల్లో ‘సేవా దాస్’ అనే సినిమా విడుదల చేస్తున్నారు.
హాలీవుడ్ సినిమా ‘మార్బియస్’ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 1నే వస్తుంది.
ఓటీటీల్లో…
రిషీ కపూర్ నటించిన చివరి చిత్రం ‘శర్మాజీ నమ్ కీన్’. ఈ సినిమా మార్చి 31న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రిషీ కపూర్ ఉంటే, మరికొన్ని సన్నివేశాల్లో పరేశ్ రావల్ కనిపిస్తారు. రిషీ కపూర్ మరణించాక ఆయన పాత్రలో పరేశ్ నటించడం గమనార్హం.
ప్రభాస్ నయా పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ కూడా ఈ వారంలోనే విడుదల కాబోతోంది. ముందుగా చెప్పిన డేట్ కాకుండా కాస్త ముందుకు తీసుకొచ్చి ఏప్రిల్ 1నే సినిమాను తీసుకొస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాకు సరైన ఫలితం రాని విషయం తెలిసిందే.
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 2 నుండి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో సినిమాకు సరైన విజయం దక్కలేదు.
మమ్ముట్టి లేటెస్ట్ సినిమా ‘భీష్మ పర్వం’ ఈ నెల 3న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఉత్తమ అంతర్జాతీయ సినిమాగా ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘డ్రైవ్ మై కార్’ ‘ముబి’ ఓటీటీలో ఏప్రిల్ 1న స్ట్రీమ్ అవ్వనుంది.
మార్చి 31న యానిమేషన్ వెబ్ సిరీస్ ‘స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మేజిక్’ (నెట్‌ఫ్లిక్స్), మార్చి 30న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘మూన్ నైట్’ వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నారు.
భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ప్రవీన్ తాంబే ఎవరు?’. శ్రేయాస్ తల్పడే టైటిల్ రోల్ పోషించాడు. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 1న సినిమా స్ట్రీమింగ్ కానుంది. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రవీన్ తాంబే అనే విషయం తెలిసిందే.
రాజిష విజయన్ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘జూన్’. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’లో రానుంది. ఏప్రిల్ 1 నుండి ‘హలో జూన్’ పేరుతో ఈ సినిమాను తీసుకొస్తున్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్లకుపై వసూలు చేసిన ఈ సినిమా సందడి ఈ వారం కూడా ఉంటుంది.