RRR Review: ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

RRR Movie Review in Telugu

ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం”. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్, సెన్సేషనల్ యాక్టర్ ఆలియా భట్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. “మోటార్ సైకిల్ డైరీస్” అనే సినిమా కథాంశం స్పూర్తితో తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్”పై ప్రపంచవ్యాప్తంగా విశేషమైన అంచనాలున్నాయి. దాదాపు ఆరేడు రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసి క్యాన్సిల్ చేసిన తర్వాత ఎట్టకేలకు నేడు (మార్చి 25) విడుదలవుతున్న ఈ చిత్రంతో రాజమౌళి తన విజయపతాకాన్ని మరోమారు ఎగరేశాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: తమ గూడెం నుండి బలవంతంగా ఎత్తుకొచ్చిన ఓ చిన్నారి పాపను తిరిగి తమ గూడానికి తీసుకెళ్ళేందుకు అక్తర్ గా పేరు మార్చుకొని ఢిల్లీ వస్తాడు భీమ్ (ఎన్టీఆర్). అలా వచ్చిన భీమ్ ను పట్టుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన పోలీస్ ఆఫీసర్ రాజు (రామ్ చరణ్). దారి వేరైనా ఇద్దరి గమ్యం ఒక్కటే.. అయితే ఆ విషయం తెలుసుకోవడానికే కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలో రామ్-భీమ్ ల నడుమ జరిగిన పోరాటం, ఇద్దరూ కలిసి చేసిన పోరాట సమాహారమే “ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం”.

నటీనటుల పనితీరు: కథకుడు విజయేంద్రప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్లు..  చరణ్ లోని నటుడ్ని “రంగస్థలం” తర్వాత పూర్తిస్థాయిలో వినియోగించుకున్న చిత్రమిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ తో తలపడే సన్నివేశాల్లో కానీ.. గుండె బిగబట్టుకొని కోపం ప్రదర్శించే సన్నివేశాల్లో కానీ చరణ్ నటన ప్రశంసనీయం. మనసులో ఓ బలమైన ఎమోషన్ ను క్యారీ చేస్తూ, అందుకు విరుద్ధమైన హావభావాలను ప్రకటించడం అనేది అంత సులువైన విషయం కాదు. ఆ రకంగా చూస్తే చరణ్ నటుడిగా ఒక పది మెట్లు ఎక్కేసినట్లే.

మొరటు మనిషిగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ లో పెద్దగా డెప్త్ లేకపోయినా.. సెంటిమెంట్ & ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన ప్రశంసనీయం. చరణ్ ను అన్న అని పిలుస్తూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ, ఎమోషనల్ వేల్యూస్ ఉన్న యువకుడిగా ఎన్టీఆర్ అదరగొట్టాడు.

మొదటిసారి ఇద్దరి హీరోల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అందుకు కారణం ఎన్నాళ్ల నుండో వారిద్దరిమధ్య ఉన్న స్నేహం మాత్రమే కాదు.. దర్శకుడు రాజమౌళి కంపోజ్ చేసిన సన్నివేశాలు కూడా.

అజయ్ దేవగన్ పాత్ర చిన్నదే అయినా.. ఆ పాత్ర క్రియేట్ చేసే ఇంపాక్ట్ పెద్దది. ఆలియా భట్ కొన్ని డైలాగ్స్ ను మాత్రమే పరిమితం అయిపోయింది. ఆమెను సరిగా వినియోగించుకోలేదనే చెప్పాలి. శ్రియ, సముద్రఖని, ఒలివియాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాహుల్ రామకృష్ణకు ఈ భారీ చిత్రంలో మంచి పాత్ర లభించింది.

సాంకేతికవర్గం పనితీరు: విజయేంద్రప్రసాద్ రాసుకున్న కథలో ఉన్న పట్టు.. కథనంలో లోపించింది. రామరాజు తమ్ముడిలా భీమ్ పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు కానీ.. క్లారిటీ ఇవ్వలేదు. ఎడిటింగ్ లో కట్ అయ్యిందో లేక వివరణ అవసరం లేదు అనుకున్నారో తెలియదు కానీ.. ఆ మెయిన్ లింక్ మాత్రం మిస్ అయ్యింది. అలాగే.. రాజమౌళి సినిమాల్లో ఘాటుగా ఉండే ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ప్రీక్లైమాక్స్ నుంచి వర్కవుటైన ఎమోషన్ సినిమా మొత్తం ఉండి ఉంటే వేరే స్థాయిలో ఉండేది. చరణ్ క్యారెక్టరైజేషన్ ను చాలా పెక్యులర్ గా రాసుకున్న విజయేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ పాత్రను సాధారణంగా కానిచ్చేయకుండా ఇంకాస్త స్పెషాలిటీ ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుండేది.

కీరవాణి నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్లస్ గా, ఇంకొన్ని సన్నివేశాలకు మైనస్ గా మారింది. పాటల విషయంలో పేరు పెట్టడానికి లేకపోయినా.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం చాలా చోట్ల సన్నివేశానికి తగ్గ ఎలివేషన్ ఇవ్వలేకపోయాడు కీరవాణి. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవల్లో ఉంది. ఇండియన్ ఆడియన్స్ కు హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో సెంధిల్ 100% విజయం సాధించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ విషయంలో సెంధిల్ పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలిలోనే తన ప్రతిభను పతాక స్థాయిలో ప్రదర్శించిన సెంధిల్.. ఈ చిత్రం కోసం వినియోగించిన ఫ్రేమ్స్ & లైటింగ్ & టింట్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను ప్రత్యేకంగా అభినందించాలి.

ఇక దర్శకధీరుడు రాజమౌళి పనితనం గురించి చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు, అది కూడా రెండు భారీ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలకు చెందిన కథానాయకులను సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ & ఎలివేషన్స్ తో చూపించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఆ కష్టమైన పనిని చాకచక్యంగా పూర్తి చేసి ఇరు వర్గాల అభిమానులను సంతుష్టులను చేశాడు. సినిమా చూసిన తర్వాత ఎవరి అభిమాని అయినా క్యారెక్టరైజేషన్ విషయంలో ఎక్కువ-తక్కువ అని మాట్లాడుకోవాలి తప్పితే.. స్క్రీన్ ప్రెజన్స్, ఎలివేషన్స్ విషయంలో గొడవపడడానికి వీల్లేకుండా చేయడం అనేది రాజమౌళికి మాత్రమే సాధ్యపడింది.

అయితే.. రాజమౌళి చిత్రాల్లో ప్రస్పుటించే ఎమోషన్ ఈ చిత్రంలో మిస్ అయ్యింది. రాజమౌళి మునుపటి 11 సినిమాలు తీసుకొంటే కేవలం క్లైమాక్స్ లో మాత్రమే కాదు.. ఆల్మోస్ట్ ప్రతి సన్నివేశంలోనూ ఓ అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. కానీ “ఆర్ఆర్ఆర్”లో చాలా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఆ ఎమోషన్ వర్కవుటయ్యింది. గుండెను హత్తుకొనే, బరువెక్కించే ఎమోషన్స్ ఈ చిత్రంలో మిస్ అయ్యాయి. ప్రతి నటుడి నుంచి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్న రాజమౌళి.. ఆలియా భట్ ను మాత్రం సరిగా వినియోగించుకోకపోవడం గమనార్హం.

రాజమౌళికి ఎంతో ఇష్టమైన యాక్షన్ బ్లాక్స్ ను మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేయించుకున్నాడు. కింగ్ సోలోమన్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ కు ఒక గొప్ప అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్.. మరీ ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ ను కంపోజ్ చేసిన విధానం గగుర్పాటుకు గురి చేస్తుంది.

విశ్లేషణ: చరణ్ లోని బెస్ట్ యాక్టర్ ను చూడడం కోసం, ఎన్టీఆర్ అద్భుతమైన ఎమోషన్స్ ను అనుభూతి చెందడం కోసం, కింగ్ సోలోమన్ కంపోజ్ చేసిన అత్యద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ కోసం “ఆర్ఆర్ఆర్”ను కచ్చితంగా చూడాల్సిందే. అయితే.. రాజమౌళి నుంచి బాహుబలి లాంటి విజువల్ వండర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్లనో లేక.. రాజమౌళి నుండి మౌళీ మాత్రమే కాక ఎమోషన్ ను కోరుకోవడం వల్లనో ఆయన రేంజ్ ఒక పది మీటర్ల ముందే ఆగిపోయిన సినిమా “ఆర్ఆర్ఆర్”. అలాగని అభిమానులు ఎక్కడా నిరాశపడరు.. పడే గ్యాప్ కూడా ఇవ్వలేదు రాజమౌళి. కానీ.. రాజమౌళి స్థాయి వేరు, అవతార్ చూసిన కళ్ళతో మిషన్ ఇంపాజబుల్ చాలా సాధారణంగా అనిపిస్తుంది. అలాగని అది తక్కువ స్థాయి సినిమా అని కాదు.. “ఆర్ఆర్ఆర్” పరిస్థితి కూడా అంతే!

రేటింగ్: 3.5/5

Share.