పేరు వినడానికి, లుక్ చూడటానికి విచిత్రంగానే ఉన్నా.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సినిమా ‘రాకా’. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఏడాది క్రితం అనౌన్స్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు గ్లింప్స్‌తో టైటిల్ రివీల్ చేశారు. ఈ క్రమంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు దర్శకుడు అట్లీ. ‘రాకా’ తన డ్రీమ్ ప్రాజెక్టు అని, దర్శకుడు కావడానికి ముందే ఈ సినిమా ఐడియా వచ్చిందని అట్లీ ఇప్పుడు చెప్పుకొచ్చారు. ఇది కేవలం సినిమా కాదని తనలో ఒక భాగమని గర్వంగా చెప్పుకొచ్చారు.
‘రాకా’ సినిమా కథను చాలా ఏళ్ల నుండి మోస్తున్నాను. 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఐడియా ఫేడ్ అవ్వకుండా చూసుకుంటున్నాను. నన్ను నా జీవితంలో పరీక్షించిన, తీర్చిదిద్దిన ఐడియాను ఏం జరిగినా సరే నాతో పాటే ఉండాలి అనుకుని అనుకున్నా ఉందని అట్లీ వ్యాఖ్యానించాడు. నిజాయితీగా చెబుతున్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమా మీద అంచనాలను పెంచే ప్రయత్నం చేశారు అట్లీ. ఆయన వయసు 39 ఏళ్లు. అంటే 21 ఏళ్ల వయసులోనే ‘రాకా’ ఐడియా వచ్చిందన్నమాట.
26 ఏళ్ల వయసులో ‘రాజా రాణి’ అనే సినిమాతో అట్లీ సినిమా పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా భారీ విజయం ఇవ్వడంతో ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అందుకున్నారు. విజయ్‌తో వరుసగా ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలు చేశారు. అన్నికి అన్నీ భారీ విజయం అందుకున్న సినిమాలే. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయిన అట్లీ షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా చేశారు. ఇప్పుడు బన్నీతో ‘రాకా’ చేస్తున్నారు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే.. అప్పుడెప్పుడో అనుకున్న కథను ఇప్పుడు తీస్తున్నారు అంటే కొత్తదనం ఉంటుందా లేదా అని. దాంతోపాటు మరో ప్రశ్న ఏంటంటే.. విజయ్‌తో అన్ని సినిమాలు చేసిన అట్లీ.. ఈ ‘రాకా’ కథను చెప్పకుండా ఉంటారా? చెబితే విజయ్ చేయకుండా ఎందుకు ఉన్నట్లు అనేదే ప్రశ్న. చూద్దాం బన్నీకి నచ్చిన కథ ఎలా ఉంటుందో. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ అవుతుందిగా సినిమా.