మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ప్లానింగ్‌లో ఓ మ్యాజిక్ ఉంది. ఎలాంటి సినిమానైనా తమదైన శైలిలో పైకి లేపుతూనే ఉంటారు. అయితే ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమాను రూ.2000 కోట్ల మార్కును దాటించాలని అనుకున్నా కుదర్లేదు అనుకోండి. ఆ విషయం వదిలేస్తే సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే, వెళ్లిన తర్వాత కూడా ఆ సినిమాకు ఓ హై ఇస్తుంటారు. బాగా హైప్ వచ్చాక రెండు పార్టులు చేసి ‘డబుల్’ క్యాష్ చేసుకుంటూ ఉంటారు.
వాళ్ల రెండు పార్టుల ముచ్చట ‘పుష్ప’ (Pushpa) సినిమాలతోనే మొదలైంది. ఆ సినిమాను రెండు పార్టులు చేయాలని ప్లాన్ చేసుకొని బాగా హైప్ పెంచారు. ఆ తర్వాత రెండు ముక్కలు చేశారు. తొలి పార్టు కంటే రెండో పార్టుకు పేరు, పైకం బాగానే సంపాదించారు. ఇప్పుడు తారక్(Jr NTR) – నీల్ (Prashanth Neel) సినిమా విషయంలో ఇదే రీతిలో ఆలోచిస్తున్నారా? సినిమా నిర్మాతల మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు అని మాట్లాడుతున్నారు.
తారక్ – నీల్ సినిమా చిత్రీకరణ ఇటీవల ఎన్టీఆర్ లేకుండా మొదలైన విషయం తెలిసిందే. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేశారు. త్వరలో తారక్ వచ్చి చేరుతాడని సమాచారం. ఆ విషయం వదిలేస్తే ప్రశాంత్ నీల్ గత సినిమాల తరహాలోనే ఈ సినిమాను కూడా రెండు పార్టులు చేస్తారట. దీనిపై ఇప్పటికే టీమ్ ఓ నిర్ణయానికి వచ్చింది అంటున్నారు. ఇద్దరి బ్రాండ్ వాల్యూ బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా టైటిల్ కోసమే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) సినిమా ‘డ్రాగన్’ను తెలుగులో మైత్రీ వాళ్లు రిలీజ్ చేశారు అని ఓ టాక్ నడుస్తోంది. తెలుగులో మైత్రీ వాళ్లే తీసుకొని ‘డ్రాగన్’ని కాస్త ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) అని మార్చారని.. తద్వార తారక్ సినిమాకు ‘డ్రాగన్’ అని పెట్టుకోవచ్చని అనుకుంటున్నారని ఓ గాసిప్ సినిమా గ్రౌండ్‌లో వినిపిస్తోంది.